bike: ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా బైక్ నడుపుతూ... లారీలను ఢీ కొన్న యువకులు.. సీసీ కెమెరాల్లో రికార్డు
- అత్యుత్సాహంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటోన్న యువత
- చైనాలో రెండు రోజుల వ్యవధిలో సీసీ కెమెరాలకు చిక్కిన రెండు ఘటనలు
- నిర్లక్ష్యపూరిత డ్రైవింగే కారణం అంటోన్న పోలీసులు
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ పోలీసులు ఎంతగా ప్రచారం చేస్తోన్నప్పటికీ యువత మాత్రం వేగాన్ని వదలడం లేదు. దీంతో భారీ మూల్యమే చెల్లించుకుంటోంది. రద్దీగా ఉండే రోడ్లపై కూడా అతి వేగంగా దూసుకుపోతూ యువత ప్రమాదాలకు గురవుతూనే ఉంది. అన్ని దేశాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది.
చైనాలో రెండు రోజుల వ్యవధిలో ఇటువంటి రెండు సంఘటనలు సీసీ కెమెరాలకు చిక్కాయి. తూర్పు చైనాలోని హ్యూయీ ప్రాంతంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఓ వ్యక్తి ఈ-స్కూటర్ నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో లారీని ఢీ కొన్నాడు. అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
తూర్పు చైనాలోని క్విడాంగ్ సిటీలోనూ ఇటువంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ వ్యక్తి ట్రక్‌ను ఢీ కొని తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసిన అక్కడి అధికారులు యువత అత్యుత్సాహం ప్రదర్శించవద్దని చెబుతున్నారు.