Supreme Court: సమసిపోయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వివాదం!
- నెలకొన్న సమస్యలు పరిష్కారం: అటార్నీ జనరల్, బీసీఐ ఛైర్మన్
- 15 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో భేటీ అయ్యాం
- సదరు న్యాయమూర్తులు విధులకు హాజరవుతున్నారు
- రాజకీయ పార్టీలు లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాయి
సుప్రీంకోర్టులో పరిస్థితి సజావుగా లేదని, ఎన్నో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది. తాజాగా అటార్నీ జనరల్ వేణుగోపాల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఛైర్మన్ మనన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ... ప్రధాన న్యాయమూర్తి, మిగతా న్యాయమూర్తుల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారమైనట్లు ప్రకటించారు.
సుమారు 15 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో తాము భేటీ అయ్యామని మనన్ మిశ్రా చెప్పారు. ఈ సమస్యను ఎత్తి చూపుతూ రాజకీయ పార్టీలు లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సమస్యలు ఉన్నాయంటూ మీడియా ముందుకు వచ్చిన సదరు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ప్రస్తుతం యథావిధిగా కోర్టుకు వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. వారందరూ చాలా నిజాయతీ గలవారని తెలిపారు.