Virat Kohli: కోడ్ ఆఫ్ కండక్ట్ 2.1.1.. కోహ్లీకి జరిమానా విధించిన ఐసీసీ
- అంపైర్ తీరుపై అసహనం
- బంతిని నేలకేసి కొట్టిన కోహ్లీ
- మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా
మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. భావోద్వేగాలను ఎంతమాత్రం కంట్రోల్ చేసుకోలేడు కోహ్లీ. తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో కోహ్లీ మరోసారి నియంత్రణ కోల్పోయాడు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సమయంలో అవుట్ ఫీల్డ్ బాగోలేదంటూ కోహ్లీ పదేపదే అంపైర్ మైఖేల్ గాఫ్ కు ఫిర్యాదు చేశాడు.
అయితే కోహ్లీ ఫిర్యాదుతో అంపైర్ ఏకీభవించలేదు. దీంతో కోహ్లీ తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తూ, బంతిని నేలకేసి కొట్టాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.1.1 ప్రకారం ఇది క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుంది. దీంతో, కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాను విధించినట్టు ఓ ప్రకటనలో ఐసీసీ తెలిపింది. తన తప్పును కోహ్లీ ఒప్పుకున్నాడని, విచారం వ్యక్తం చేశాడని... దీంతో, చిన్నపాటి జరిమానాను మాత్రమే విధిస్తున్నామని... విచారణ జరపడం లేదని పేర్కొంది.