Chandrababu: యువకుడికి క్షమాపణలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన చంద్రబాబు.. మరోసారి అలా జరగదని హామీ!
- తల్లిదండ్రుల సమాధులకు నివాళులు అర్పించిన చంద్రబాబు
- ప్రజల నుంచి వినతుల స్వీకరణ
- ట్రాఫిక్ నిలిపివేయడంతో ఇబ్బందులు
- యువకుడి అసహనం.. బాబు క్షమాపణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓ సామాన్య యువకుడిని క్షమాపణలు కోరడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది. తన వల్ల ఏర్పడిన అసౌకర్యానికి క్షమించాలని చంద్రబాబు వేడుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నారావారిపల్లె వచ్చిన చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులు అర్పించారు. తిరిగి వస్తూ రోడ్డు పొడవునా బారులుతీరిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. దీంతో పోలీసులు రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఫలితంగా పలు గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలో పులిచెర్ల మండలం దిగువమూర్తిపల్లెకు చెందిన నవీన్ కుటుంబసభ్యులతో కలిసి రంగంపేట నుంచి నడుచుకుంటూ నారావారిపల్లెకు వచ్చాడు. అదే సమయంలో వాహనాలను నిలిపేయడంతో వెళ్లే వీలులేక ఇక్కట్లు ఎదుర్కొన్నాడు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశాడు. అక్కడున్న వారిని ప్రశ్నించాడు.
ఇది చూసిన చంద్రబాబు కల్పించుకుని ఆరా తీశారు. నవీన్‌ను పిలిచి ఏం జరిగిందని ప్రశ్నించారు. యువకుడు బదులిస్తూ రెండు గంటలుగా వాహనాలను నిలిపివేశారని, పండుగ పూట ఊరెళ్లేందుకు వస్తే రెండు గంటలుగా ట్రాఫిక్ నిలిపివేశారని, ఇళ్లకు పోనివ్వకుండా రోడ్డుపై ఆపేయడం ఏమీ బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నపిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారని, కళ్లు తిరిగి పడిపోయేలా ఉన్నారని చెప్పాడు.
స్పందించిన చంద్రబాబు నొచ్చుకున్నారు. వెంటనే ‘‘అయామ్ సారీ అమ్మా, ఇకపై అలా జరగదు. ఎస్పీకి చెబుతాను’’ అంటూ సముదాయించారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించాలని పోలీసులను ఆదేశించారు. చంద్రబాబు సారీ చెప్పడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఎటువంటి భేషజాలకు పోకుండా తన వల్ల కలిగిన అసౌకర్యానికి ఆయన క్షమాపణలు చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది.