KCR: పంచాయతీ ఎన్నికల వేడి పుట్టించిన కేసీఆర్.. వచ్చే నెలలోనే ఎన్నికలు!
- తెలంగాణలో కొత్తగా మరో 4 వేల పంచాయతీల ఏర్పాటు
- ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై విధానపరమైన నిర్ణయం
- ఒక్కో పంచాయతీకి మధ్య రెండు కిలోమీటర్ల దూరం
వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. అయితే వీటిని ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలా? లేక పరోక్ష పద్ధతిలోనా? అన్న విషయమై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మంగళవారం తన అధ్యక్షతన ప్రగతి భవన్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొత్తగా ఏర్పాటు చేయబోయే పంచాయతీలకు సంబంధించి సరిహద్దులను నిర్ణయించి ఈనెల 25 నాటికి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. కొత్త పంచాయతీ జనాభా కనీసం 500 ఉండేలా చూడాలని సూచించారు. అలాగే విడిపోతున్న పంచాయతీకి, కొత్త పంచాయతీకి మధ్య కనీసం రెండు కిలోమీటర్ల దూరం ఉండాలని అన్నారు. పంచాయతీల ఏర్పాటు వివాదానికి తావులేకుండా ఉండాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,684 పంచాయతీలు ఉన్నాయని, మరో 4వేల కొత్త పంచాయతీలు ఏర్పాటు కావచ్చని సీఎం వివరించారు.