bhagat singh: పాకిస్థాన్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న భగత్ సింగ్!
- భగత్ సింగ్ ను నిషాన్ ఏ హైదర్ తో సత్కరించాలంటూ డిమాండ్
- జిన్నా కన్నా భగత్ సింగే గొప్ప వ్యక్తి
- అభ్యంతరం వ్యక్తం చేసిన హఫీజ్ సయీద్
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించిన సర్దార్ భగత్ సింగ్ అంశం ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్ లో ప్రకంపనలు సృస్టిస్తోంది. భగత్ సింగ్ ను అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అయిన 'నిషాన్ ఏ హైదర్'తో సత్కరించాలనే డిమాండ్ పాక్ లో ఊపందుకుంటోంది. పాక్ సైన్యంలో అత్యున్నత ధైర్య సాహసాలు, ప్రతిభ కనబరిచే సైనికులకు ఇచ్చే పురస్కారమే నిషాన్ ఏ హైదర్.
నిరంతరం భారత్ పై విషం చిమ్మే పాకిస్థాన్ లో ఈ పరిణామం చోటు చేసుకోవడం నమ్మలేని నిజమైనప్పటికీ... ఇది వాస్తవం. 86 ఏళ్ల కిందట లాహోర్ లోని షాదమన్ చౌక్ లో భగత్ సింగ్ ను బ్రిటిషర్లు ఉరి తీశారు. ఇప్పుడు ఆ చౌక్ లో భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ డిమాండ్ చేస్తోంది.
ఫౌండేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఖురేషీ మాట్లాడుతూ, భగత్ సింగ్ ఓ యూత్ ఐకాన్ అని కొనియాడారు. ఆయన ఆత్మ త్యాగాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా కన్నా భగత్ సింగ్ త్యాగానికే ఎక్కువ నివాళి అర్పించాలని లేఖలో తెలిపారు. నిజమైన స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ అని... అతన్ని అత్యున్నత గ్యాలెంటరీ మెడల్ తో సత్కరించాలని కోరారు.
మరోవైపు, భగత్ సింగ్ కు అత్యున్నత సైనిక పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్ పై ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి, జమాతే ఉద్దవా అధినేత హఫీజ్ సయీద్ అభ్యంతరాలను వ్యక్తం చేశాడు. ఇలాంటి చర్యలు పాక్ పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తాయని చెప్పాడు.