Jana Sena: కుట్రలు జరుగుతున్నాయి.. పవన్ కల్యాణ్ అభిమానులు సంయమనం పాటించాలి: జనసేన కీలక ప్రకటన
- జనసేన పార్టీది నాలుగేళ్లు కూడా నిండని పసి ప్రాయం
- ఇటువంటి పసి బిడ్డను ఎదగనీయకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి
- ఇదంతా రాజకీయంలో ఒక భాగం
తమ కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు సంయమనం పాటించాలని సూచిస్తూ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి పేరిట ఈ రోజు ప్రెస్ నోట్ విడుదల అయింది. 'జనసేన పార్టీది నాలుగేళ్లు కూడా నిండని పసి ప్రాయం. ఇటువంటి పసి బిడ్డను ఎదగనీయకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా రాజకీయంలో ఒక భాగం. అయినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో దృఢ చిత్తంతో, అఖండ తెలుగు జాతి అండతో జనసేన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోన్న విషయం విజ్ఞులైన వారందరికీ విదితమే. ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ శ్రేణుల్ని, అభిమానులను గందరగోళంలో పడేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి.
జనసేనను తెలుగు ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటారని పవన్ కల్యాణ్‌కి విశ్వాసం ఉంది. ఆయన మాటలను ఆచరిద్దాం.. ఆయన అడుగు జాడల్లో నడుద్దాం. జనసేన పార్టీ సిద్ధాంతాలయిన కులాలని కలిపే ఆలోచన విధానం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం.. భాషల్ని గౌరవించే సంప్రదాయం.. సంస్కృతులని కాపాడే సమాజం.. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం.. కోసం కృషి చేద్దాం' అంటూ పార్టీ ఉపాధ్యక్షుడు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కుల విమర్శలు చేసేవారి పట్ల ఎలా ఉండాలో గతంలో పవన్ కల్యాణ్ తెలిపారని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. జనసేనను అభిమానించే వారంతా ఆ రోజు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను గుర్తు చేసుకోవాలని కోరారు. కుల విమర్శలు చేస్తోన్న వారిని విస్మరించాలని, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
(జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన ప్రకటన ఇదే..)