andal issue: 'గోదాదేవి'పై వ్యాఖ్యల వివాదం.. మద్రాస్ హైకోర్టులో సినీ కవి వైరముత్తుకు ఊరట!
- గోదాదేవి దేవదాసిగా చనిపోయిందన్న వైరముత్తు
- పలు పోలీస్ స్టేషన్లలో కేసులు
- విచారణపై స్టే విధించిన హైకోర్టు
'ఆండాళ్'పై వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా తమిళనాడులో దుమారం రేపుతున్నాయి. ఆండాళ్ (గోదాదేవి)పై ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన హైకోర్టు పోలీసుల విచారణపై స్టే విధించింది.
ఇటీవల శ్రీవిల్లిపుత్తూరులో జరిగిన ఓ సదస్సులో వైరముత్తు మాట్లాడుతూ, గోదాదేవి దేవదాసిగానే మృతి చెందిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హిందుత్వవాదులు ధ్వజమెత్తారు. ఆండాళ్ దేవి ఆలయానికి వచ్చి, ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పలు స్టేషన్లలో కేసులు పెట్టారు. దీనిపై వైరముత్తు హైకోర్టును ఆశ్రయించారు.
నిన్న ఉదయం ఈ కేసు విచారణ హైకోర్టు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా వైరముత్తు తరపు న్యాయవాది మాట్లాడుతూ, అమెరికా పరిశోధకుడి వ్యాసంలో గోదాదేవి దేవదాసిగానే చనిపోయిందంటూ పేర్కొనడాన్ని మాత్రమే వైరముత్తు ఉదహరించారని చెప్పారు. ఈ వాదనతో ఏకీభవించిన జడ్జి... గోదాదేవిపై వైరముత్తు వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి కాదని... ఈ విషయంలో రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. పోలీసుల విచారణపై స్టే ఇస్తున్నట్టు వెల్లడించారు. తదుపరి విచారణను ఫిబ్రవరికి 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు వైరముత్తు మాట్లాడుతూ, తాను గోదాదేవిని కించపరచలేదని చెప్పారు. సదస్సులో గోదాదేవి వైభవం గురించి ముప్పావు గంటసేపు ప్రసంగించానని, అదే సమయంలో అమెరికా పరిశోధకుడు వెల్లడించిన వాటిని సభికుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. గోదాదేవిని తాను వేశ్యగా పేర్కొన్నట్టు విమర్శలు రావడం దారుణమని అన్నారు. ఎవరినైనా తాను బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు.