indian groom: భారతీయ వరుడు, పాకిస్థానీ వధువు... పెళ్లికి సుష్మా స్వరాజ్ సాయం
- వీసా కోసం ఇబ్బంది పడ్డ పెళ్లి కూతురు
- సుష్మా చొరవతో ఒక్కటైన జంట
- ధన్యవాదాలు తెలిపిన పెళ్లి కొడుకు
లక్నోకి చెందిన నఖీ అలీ ఖాన్‌కి పాకిస్థాన్‌కి చెందిన సబాహత్ ఫాతిమాతో పెళ్లి నిశ్చయమైంది. కానీ వారి పెళ్లికి వీసా అడ్డంకిగా మారింది. పాకిస్థాన్ నుంచి ఇండియా వచ్చేందుకు సబాహత్‌కి వీసా మంజూరు కాలేదు. దీంతో పెళ్లి కొడుకు నఖీ అలీ ఖాన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కి తన సమస్యను విన్నవించుకున్నాడు. ఎప్పటిలాగే సుష్మా స్వరాజ్ తనకు వీలైనంత సాయం చేసింది. సబాహత్‌కి వీసా మంజూరు చేసింది. దీంతో వారి వివాహం శుక్రవారం రాత్రి జరిగింది.
ఈ సందర్భంగా పెళ్లి కొడుకు నఖీ అలీ ఖాన్, సుష్మా స్వరాజ్‌కి ధన్యవాదాలు తెలిపారు. నఖీ అలీ ఖాన్, సబాహత్ కుటుంబాల మధ్య ఎప్పట్నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ స్వాతంత్ర్య విభజన సమయంలో సబాహత్ కుటుంబీకులు పాకిస్థాన్ వెళ్లిపోయారు. త్వరలోనే సబాహత్‌కి భారత పౌరసత్వం పొందే విషయంలో కూడా సుష్మా స్వరాజ్‌ను కలవనున్నట్లు నఖీ తెలిపారు. విదేశాంగ మంత్రి ఇలా పెళ్లి జంటలను ఏకం చేయడం ఇదేం మొదటిసారి కాదు. గత ఆగస్టులో కూడా కరాచీకి చెందిన సాదియా, లక్నోకి చెందిన సయ్యద్ షారిక్లకు కూడా ఇదే సమస్య వచ్చినపుడు ఆమె తన వంతు సాయం చేసి వారి పెళ్లి జరిగేలా చేశారు.