malala: మలాలా నిధితో ఆపిల్ సంస్థ ఒప్పందం.. బాలికల చదువుకు చేయూత
- సాంకేతిక సాయం కూడా చేయనున్న ఆపిల్
- భారత్, లాటిన్ అమెరికా దేశాలకి నిధుల విస్తరణ
- పత్రికా ప్రకటనలో పేర్కొన్న సీఈఓ టిమ్ కుక్
బాలికలకు నాణ్యమైన చదువును అందించడం కోసం మలాలా ఫండ్‌తో ఆపిల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్, ఆమె తండ్రి జియాఉద్దీన్‌లు కలిసి ఈ మలాలా ఫండ్‌ని నెలకొల్పారు. ఇప్పుడు ఆపిల్ ఒప్పందంతో ఈ ఫండ్ గ్రాంట్లను రెట్టింపు చేసి, భారత్, లాటిన్ అమెరికా దేశాలకు కూడా విస్తరించనున్నట్లు తెలుస్తోంది. కేవలం నిధుల సహాయం మాత్రమే కాకుండా సాంకేతిక సాయం కూడా ఆపిల్ అందించనుంది.
బాలికలకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా లింగ సమానత్వాన్ని సాధించే వీలు కలుగుతుందనే ఉద్దేశంతో మలాలా ఫండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. మలాలా ఎంతో మందికి ఆదర్శప్రాయమైన వ్యక్తి అని, ఆమెతో కలిసి పనిచేయనుండటం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని టిమ్ కుక్ అన్నారు. ప్రస్తుతం బాలికా విద్యకు తీవ్ర అడ్డంకులు ఉన్న పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నైజీరియా, లెబనాన్, జోర్డాన్ దేశాల్లో మలాలా ఫండ్ క్రియాశీలకంగా పనిచేస్తోంది.