chief secretary: ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులన్నీ నెలాఖరులోగా పరిష్కరించాలి: ఏపీ సీఎస్ ఆదేశం
- జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో దినేష్ కుమార్ భేటీ
- అర్జీలను ఆర్థిక, ఆర్థికేతరమైన వాటిగా విభజించాలి
- ఫిర్యాదులను వాటి ఆవశ్యకతను బట్టి మూడు కేటగిరీలుగా విభజించాలి
- ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలి
ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులు, ఆర్థికేతరమైన అంశాలకు సంబంధించిన అర్జీలన్నిటినీ జనవరి నెలాఖరులోగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్.. జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు. ఈ రోజు అమరావతిలోని సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన గ్రీవియెన్స్ ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన అర్జీలను ఆర్థిక, ఆర్థికేతరమైన వాటిగా విభజించి వాటిలో ఆర్థికేతరమైన విజ్ఞాపనలన్నిటినీ ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి వెంటనే జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖాధిపతులకు డీఓ లేఖ రాయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే, వచ్చిన అర్జీలలో ఆర్థిక, ఆర్థికేతర విన్నతులు వేరుచేయడమేగాక మరలా వాటిలో వ్యక్తిగత, సామాజిక పరమైన వాటిని విభజించి వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అలాగే, సామాజిక పరమైన విజ్ఞప్తులు, ఫిర్యాదులను వాటి ఆవశ్యకతను బట్టి మూడు కేటగిరీలుగా విభజించి ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ చెప్పారు. అదే విధంగా వ్యక్తిగత, సామాజిక పరమైన అంశాలకు సంబంధించిన ఆర్థికపరమైన విజ్ఞప్తులను జిల్లా, శాఖల వారీగా విభజించి వాటి పరిష్కారానికి ఎంత మొత్తం నిధులు అవసరం ఉంటుందో నివేదిక సిద్ధం చేయాలని సీఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
గ్రీవియెన్స్ ఫిర్యాదుల పరిష్కారంపై తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని స్పష్టం చేశారు. మొత్తం మీద ప్రజల నుండి వచ్చిన అర్జీలు, ఫిర్యాదులన్నిటినీ సకాలంలో పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి పి.వి.చలపతిరావు, ప్రణాళిక శాఖ సంచాలకులు గోపాల్, రియల్ టైమ్ గవర్నెన్స్ డైరెక్టర్ ఎ.బాలాజి తదితరులు పాల్గొన్నారు.