daughter: భారతీయుల్లో బలపడుతున్న కుమార్తె కాంక్ష... 79 శాతం ఓటు ‘ఆమె’కే!
- గతంతో పోలిస్తే పెరిగిన ఆకాంక్ష
- బాబు కావాలని కోరుకునే మహిళలు 81 శాతం
- జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వేలో వెల్లడి
అమ్మాయి అంటే భారం అన్న భావన భారతీయ సమాజంలో క్రమంగా కనుమరుగవుతోంది. కుమార్తే కావాలని కోరుకునే వారు అంతకంతకూ పెరిగిపోతున్నారు. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 15 నుంచి 49 ఏళ్లలోపు వయసున్న మహిళళ్లో 79 శాతం మంది తమకు కనీసం ఒక్క కూతురు అయినా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే, 15 నుంచి 54 ఏళ్లలోపు వయసున్న పురుషుల్లో తమకు కుమార్తె కావాలని ఆశిస్తున్న వారు 78 శాతం ఉండడం విశేషం.
ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, గ్రామీణ ప్రజలు, ఆర్థికంగా వెనుకబడిన వారిలోని పురుషులు, మహిళల్లో మరింత బలంగా కుమార్తె కావాలన్న కోరిక ఉన్నట్టు సర్వే తెలియజేస్తోంది. 2005-06 నాటి సర్వేలో కుమార్తె కావాలన్న ఆకాంక్ష మహిళల్లో 74 శాతంగా, పురుషుల్లో 65 శాతంగానే ఉండగా, నాటితో పోలిస్తే ఇది ఇంకా పెరిగినట్టు తెలుస్తోంది. అయితే, తమకు ఓ బాబు కావాలన్న ఆకాంక్ష సైతం బలంగానే ఉంది. గ్రామీణ మహిళల్లో 81 శాతం మంది, పట్టణ మహిళల్లో 75 శాతం మంది తమకు బాబు కావాలని కోరుకుంటున్నారు.