anushka: హీరోలకు భారీ పారితోషికం ఇవ్వడం న్యాయమే!: అనుష్క
- సినిమా పరాజయం పాలైతే ఎక్కువ నష్టపోయేది హీరోలే!
- ఎక్కడైనా పనిని బట్టే పారితోషికం వుంటుంది
- ‘అరుంధతి’ సినిమా కంటే భాగమతి చాలా విభిన్నంగా ఉంటుంది
చిత్ర పరిశ్రమలో కథానాయికల కన్నా కథానాయకులకు ఎక్కువ పారితోషికం ఇవ్వడం న్యాయమేనని ప్రముఖ నటి అనుష్క అభిప్రాయపడింది. ‘భాగమతి’ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, ఏ వృత్తిలో అయినా పనిని బట్టి పారితోషికం ఉంటుందని చెప్పింది. వాస్తవానికి సినిమాను హీరోలే తమ భుజాలపై మోస్తుంటారని చెప్పింది.
అంతేకాకుండా సినిమా పరాజయం పాలైతే ఎక్కువ నష్టపోయేది కూడా వారేనని పేర్కొంది. కాబట్టి వారికే ఎక్కువ పారితోషికం ఇస్తారని, అంత పారితోషికం వారికి ఇవ్వడం అన్నది న్యాయమేనని తెలిపింది. పారితోషికం కోసం పోరాటం చేయడం కన్నా.. నటీమణుల కోసం ఉత్తమ కథలు రాసేలా, వారిని శక్తిమంతమైన పాత్రల్లో చూపించేలా చేసేందుకు పోరాడితే బాగుంటుందని ఆమె అభిప్రాయపడింది.
ఇక తాను నటించిన తాజా చిత్రం 'భాగమతి' సినిమా ‘అరుంధతి’ సినిమా కంటే చాలా విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంది. థ్రిల్లర్ కథాంశంతో ‘భాగమతి’ని తెరకెక్కించామని తెలిపింది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, దీనికి తమన్ బాణీలు అందించాడని చెప్పింది.