Padmavat: 'పద్మావత్'పై కర్ణిసేన పగ... థియేటర్లు, మాల్స్ దగ్ధం, వందలాది వాహనాలకు నిప్పు... పోలీసుల కాల్పులు!

  • అహ్మదాబాద్ లో పెను విధ్వంసం
  • మాల్స్, థియేటర్లపై విరుచుకుపడిన కర్ణిసేన
  • గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
  • మరో నాలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొంది, రేపు విడుదలకు సిద్ధమవుతున్న 'పద్మావత్' చిత్రానికి రాజ్ పుత్ కర్ణిసేన నుంచి నిరసనల సెగ ఉవ్వెత్తున ఎగసింది. ఈ సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధమైన గుజరాత్ థియేటర్లపై కర్ణిసేన సత్తా చూపింది. అహ్మదాబాద్ వన్ మాల్స్, హిమాలయ తదితర థియేటర్ల వద్ద కర్ణిసేన కార్యకర్తలు అన్నంతపనీ చేశారు. ఇష్టానుసారం విధ్వంసం సృష్టిస్తూ, రోడ్లపై ఉన్న దాదాపు 150 వాహనాలకు నిప్పు పెట్టారు.

థియేటర్లలోకి జొరబడి కాల్పులు జరిపారు. అల్లర్లకు దిగిన వందలాది మంది తమను ఎవరూ గుర్తు పట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని ఈ దాడులు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగేసరికే పరిస్థితి చెయ్యిదాటి పోయింది. గాల్లోకి కాల్పులు జరిపి, లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టాల్సి వచ్చింది. గుజరాత్ డీజీపీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, అదనపు బలగాలను రంగంలోకి దించారు.

మరోవైపు గుజరాత్ లో హింస జరిగిన గంటల వ్యవధిలోనే మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఆందోళనలు పెరిగిపోయాయి. కాన్పూర్ లో ఓ షాపింగ్ మాల్ లోకి ప్రవేశించిన కర్ణిసేన ధ్వంసానికి దిగింది. ఇండోర్, గ్వాలియార్, మొరేనా పట్టణాలతో పాటు ఉజ్జయిని లోనూ ఇదే పరిస్థితి. కర్ణిసేన విధ్వంసం తరువాత, పలు థియేటర్ల యజమానులు ఈ చిత్రాన్ని తాము ప్రదర్శించబోవడం లేదంటూ బోర్డులు పెట్టారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News