BMW: ఆ బీఎండబ్ల్యూ కారు మొత్తం జరిమానానూ 'సింగల్ క్లిక్'తో చెల్లించేసింది!
- జంటనగరాల్లోనే అత్యధిక జరిమానాలు
- మొత్తం రూ. లక్షకు పైమాటే
- ఒకేసారి మొత్తం చెల్లించిన యజమాని
అది 'ఏపీ 28 డీఎక్స్ 6363' నంబర్ గల బీఎండబ్లూ కారు. ఆ కారు రోడ్డుపైకి ఎక్కితే, ట్రాఫిక్ నిబంధనలను ఒక్కమారైనా పాటించింది లేదు. సైబరాబాద్ పరిధిలో ఈ కారుపై పోలీసులు విధించిన జరిమానా ఎంతో తెలుసా? రూ. 1,00,450 మాత్రమే. జంట నగరాల్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో టాప్-20 వాహనాల ఉల్లంఘనల మొత్తం రూ. 4.80 లక్షలుగా ఉండగా, ఈ కారుదే అత్యధిక జరిమానా.
ఇక ఈ మొత్తాన్ని కారు యజమాని ఆన్ లైన్ మాధ్యమంగా 'ఒక్క క్లిక్'తో క్లియర్ చేశారు. పోలీసుల నుంచి వస్తున్న ఒత్తిడి లేదా కారును విక్రయించాలన్న ఉద్దేశంతోనే దాని యజమాని జరిమానా మొత్తాన్ని చెల్లించాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. గతంలో స్పాట్ చెలాన్లు విధించే వాళ్లమని, అప్పట్లో చెలాన్ల పెండింగ్ తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ఈ-చలాన్లు పంపుతున్నందున వీటిని చాలా మంది చెల్లించడం లేని కారణంగానే పెండింగ్ జరిమానాలు అధికంగా ఉన్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.