Kinjarapu Acchamnaidu: ఉన్న పార్టీలు చాలు... కొత్త పార్టీ అక్కర్లేదు: అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్య
- పార్టీని నిలుపుకునేందుకే జగన్ పాదయాత్ర
- బాబు నాయకత్వంలో సజావుగా పాలన
- ప్రజా స్పందన సంతృప్తికరమన్న అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీలు చాలని, మరే ఇతర కొత్త రాజకీయ పార్టీ అవసరం లేదని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. పతనమవుతున్న తన పార్టీని తిరిగి నిలుపుకునేందుకే వైఎస్ జగన్ పాదయాత్ర పేరిట ఓ డ్రామాకు తెరలేపారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో పాలన సజావుగా సాగుతోందని, ఇంటింటికీ తెలుగుదేశం, జన్మభూమి వంటి కార్యక్రమాలపై ప్రజా స్పందన సంతృప్తికరంగా ఉందని అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తదుపరి ఎన్నికల్లో బీజేపీతో కలిసేందుకు సిద్ధమని, వైకాపా అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ, జగన్ మాటలు హాస్యాస్పదమన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే, తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వెల్లడించిన ఆయన, దాన్ని పక్కన బెట్టారని విమర్శించారు. ఆయన పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదని చెప్పారు. కాగా, కొత్త పార్టీలు అక్కర్లేదని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు జనసేన గురించి చేసినవా? అన్న చర్చ జరుగుతోంది.