Virat Kohli: కోహ్లీపై విమర్శలతో దుమారాన్ని రేపిన సెహ్వాగ్
- మైదానంలో కోహ్లీ చాలా తప్పులు చేస్తున్నాడు
- కోహ్లీని ఒక్క ఆటగాడు కూడా ప్రశ్నించడం లేదు
- ఇలాగే కొనసాగితే కెప్టెన్సీకే ముప్పు
భారత మాజీ డేరింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్ కోహ్లీని ఏకిపారేశాడు. మైదానంలో కోహ్లీ అనేక తప్పులు చేస్తున్నాడని... కానీ, ఎవరూ వేలెత్తి చూపించడం లేదని విమర్శించాడు. వాస్తవానికి కెప్టెన్ చేసే పొరపాట్ల గురించి నలుగురైదుగురు ఆటగాళ్లు మాట్లాడుతూ ఉంటారని... కానీ, భారత జట్టులో అలాంటి ఆటగాళ్లను తాను చూడలేదని చెప్పాడు.
మైదానంలో కానీ, డ్రెస్సింగ్ రూమ్ లో కానీ కోహ్లీ చేస్తున్న పొరపాట్ల గురించి వేలెత్తి చూపే ఒక్క ఆటగాడు కూడా లేడని అన్నాడు. కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్ అనడంలో సందేహమే లేదని.. ఇతర ఆటగాళ్ల నుంచి కూడా అదే స్థాయి ఆట తీరును అతను ఆశిస్తున్నాడని... దీనివల్లే అతను అంచనాలను అందుకోలేక పోతున్నాడని... ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కెప్టెన్సీకే ప్రమాదకరమని చెప్పాడు.
తనలాగే ఇతర ఆటగాళ్లు కూడా వేగంగా పరుగులు చేయాలని కోహ్లీ ఆశిస్తున్నాడని... ఇందులో తప్పేంలేదని అన్నాడు. సచిన్ కూడా కెప్టెన్ గా ఉన్నప్పుడు అతనిలా ఎక్కువ పరుగులు చేయాలని అడిగేవాడని... తనలా వేగంగా ఎందుకు రన్స్ చేయడం లేదని ప్రశ్నించేవాడని గుర్తు చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ లో కోచ్ ల సలహాలు తీసుకుంటున్న కోహ్లీ... మైదానంలో వాటిని అమలు పరచడం లేదని అన్నాడు. ఏ ఒక్కరి కష్టంతోనే విజయం దక్కదని... టీమ్ సభ్యుల సమష్టి కృషి ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందని చెప్పాడు. గెలుపుబాట పట్టేందుకు భారత జట్టు టీంవర్క్ చేయాలని సూచించాడు.