gazal srinivas: గజల్ శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు!
- నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ
- రూ.10 వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు
- వారంలో రెండు సార్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలని ఆదేశాలు
- ఏ-2 నిందితురాలు పార్వతికి ముందస్తు బెయిల్ మంజూరు
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ మేరకు నాంపల్లి కోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.10 వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు ఇవ్వాలని, వారంలో రెండు సార్లు (ప్రతి బుధ, ఆది వారాలు) పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ ముందు నిందితుడు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు తీర్పు కాపీలను పరిశీలించిన అనంతరం చంచల్ గూడ జైలు నుంచి గజల్ శ్రీనివాస్ ను అధికారులు విడుదల చేసే అవకాశముంది. మరోపక్క, ఇదే కేసులో ఏ-2 నిందితురాలుగా ఉన్న పార్వతికి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. పార్వతిని ఇంతవరకూ పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. ఆమె పరారీలో ఉండటంతో అరెస్టు చేయలేకపోయామని పోలీసుల తరపు న్యాయవాది చెప్పినట్టు సమాచారం.
కాగా, తన కార్యాలయంలోని ఓ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో గజల్ శ్రీనివాస్ ను పంజాగుట్ట పోలీసులు ఈ నెల 2న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురవ్వడంతో ఈ నెల 12న నాంపల్లి కోర్టులో గజల్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, గజల్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ పంజాగుట్ట పోలీసులు కౌంటర్ వ్యాజ్యం దాఖలు చేయడం విదితమే.