whatsapp: భారత్‌లోనూ అందుబాటులోకి వాట్సాప్ బిజినెస్ యాప్!
- చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఉపయోగం
- ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యం
- త్వరలో ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై విడుదల
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ బిజినెస్ యాప్ ఇప్పుడు భారత్ కు కూడా వచ్చేసింది. ఇప్పటి వరకు ఇండోనేషియా, ఇటలీ, మెక్సికో, యూకే, యూఎస్ దేశాల్లో మాత్రమే ఇది అందుబాటులో వుంది. భారత్‌లోని చిన్న, మధ్య తరహా వ్యాపారులు వాట్సాప్ బిజినెస్ యాప్‌ను ఇప్పుడు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ లభిస్తుంది.
త్వరలో ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై కూడా ఈ యాప్‌ను విడుదల చేయనున్నారు. వ్యాపారస్తులు ఎవరైనా సరే దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని తమ ఖాతాదారులకి నేరుగా టచ్‌లో ఉండొచ్చు. తద్వారా సులభంగా వ్యాపార కార్యలాపాలను నిర్వహించుకోవచ్చు. వాట్సాప్ లాగానే ఈ బిజినెస్ యాప్ కూడా కాల్స్, మెసేజ్‌లను థర్డ్‌పార్టీకి చేరకుండా ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ను ఆఫర్ చేస్తోంది.
ప్రొఫైల్ ఫొటో సెక్యూరిటీతోపాటు లైవ్ లొకేషన్ షేరింగ్‌ను కూడా అనుమతిస్తుంది. అయితే ఇప్పటికే ఆన్లైన్ పేమెంట్ల దిగ్గజం పేటీఎం కూడా చిన్న, మధ్యస్థ వ్యాపారులకు సౌలభ్యంగా ఉండటం కోసం `పేటీఎం ఫర్ బిజినెస్` యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.