Rajasthan: ప్రేమ కోసం దొంగయ్యాడు... ప్రియురాలు దక్కలేదు కానీ కటకటాలపాలయ్యాడు!
- యువతితో వెళ్లిపోయిన రమేష్
- వెనక్కి రావడంతో పంచాయతీ జరిమానా
- జరిమానా చెల్లించేందుకు బైక్ ల దొంగతనం
ప్రియురాలిని దక్కించుకునేందుకు దొంగగా మారిన యువకుడు కటకటాలపాలైన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఉదయ్ పూర్ కు చెందిన రమేశ్ (22) అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి ఏడాది క్రితం ఆమెతో జీవితం పంచుకోవాలని ఆమెతో పారిపోయాడు. కొన్నాళ్ల తరువాత తిరిగి స్వస్థలానికి చేరుకున్నాడు.
అప్పటికే ఆమె కుటుంబ సభ్యులు రమేష్ పై పంచాయతీలో ఫిర్యాదు చేయడంతో, వారు రాగానే అమ్మాయి కుటుంబ సభ్యులకు రమేశ్ 40 వేల రూపాయలు జరిమానాగా చెల్లించి కాపురం చేసుకోవచ్చని, అంతవరకు ఆమె పుట్టింట్లోనే ఉంటుందని పంచాయతీ తీర్పునిచ్చింది. దీంతో జరిమానా కట్టాల్సిన 40 వేల రూపాయల సంపాదనకు మరోఇద్దరితో జత కట్టిన రమేష్, బైక్ దొంగతనాలు ప్రారంభించాడు. 40 వేల రూపాయలు జమ చేసి ఆమె కుటుంబ సభ్యులకు ఇచ్చేశాడు.
ఇంతలో ఆమె మరొక వ్యక్తితో పుట్టింటి నుంచి వెళ్లిపోయింది. ఈ సమాచారం తెలుసుకుని బైక్ పై వెళ్తున్న రమేష్, అతని ఇద్దరి సహచరులను పోలీసులు అడ్డగించి ఆరాతీయడంతో దొంగగా మారిన వైనాన్ని వారికి రమేష్ వివరించాడు. అయితే రమేష్ ఇద్దరు సహచరుల్లో థావర్ అనే వ్యక్తి అంతకు ముందే ఎన్నో దొంగతనాలకు పాల్పడ్డాడు. థావర్ 50 బైకులను దొంగిలించాడని ఉదయ్ పూర్ లోని హీరాన్మాగిరి పోలీసుస్టేషన్ ఎస్సై సంజీవ్ స్వామి తెలిపారు. వారి నుంచి 12 మోటారుబైక్ లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ కు పంపారు. రమేష్ కు ప్రేమించిన యువతి దక్కకపోగా, కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.