doctor Larry Nassar: మహిళా జిమ్నాస్ట్ లపై వేధింపుల కేసులో.. డాక్టర్ కు 175 ఏళ్ల జైలు శిక్ష!
- మహిళా జిమ్నాస్ట్ లపై వేధింపులు
- 175 ఏళ్ల జైలు శిక్షను విధించిన కోర్టు
- ఇప్పటికే 60 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్న ల్యారీ
మహిళా జిమ్నాస్ట్ ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యూఎస్ఏ జిమ్నాస్టిక్స్ టీమ్ డాక్టర్ ల్యారీ నాస్సర్ కు 175 ఏళ్ల కారాగార శిక్షను విధిస్తూ ఇంఘామ్ కౌంటీ సర్క్యూట్ జడ్జ్ రోస్ మేరీ ఆక్విలినా తీర్పును వెలువరించారు. దాదాపు 160 మంది బాధితుల వాంగ్మూలాలను పరిశీలించిన తర్వాత ఈ తీర్పును వెలువరించారు. అంతేకాదు, నీ డెత్ వారెంట్ పై సంతకం చేశానంటూ కోర్టు హాలులోనే ప్రకటించారు. జడ్జి తీర్పుతో కోర్టులో ఉన్న బాధితులు, ఇతరులు ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది భావోద్వేగానికి గురై, కంట తడి పెట్టారు.
ల్యారీ చేతిలో వేధింపులకు గురైన తొలి మహిళ రాచెల్ డెన్హోలాండర్ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే లీడ్ ప్రాసిక్యూటర్ ఏంజెలా పొవిలైటిక్ ను సంతోషంతో హత్తుకున్నారు. నాలుగు ఒలింపిక్ గేమ్స్ కు ప్రోగ్రామ్స్ ఫిజీషియన్ గా ల్యారీ వ్యవహరించారు. కోర్టు విచారణ సందర్భంగా బాధితులందరికీ ల్యారీ క్షమాపణలు చెప్పారు. ఆవేదనతో మీరు చేసిన వ్యాఖ్యలను జీవించినంత కాలం గుర్తుంచుకుంటానని తెలిపారు. మరోవైపు చైల్డ్ పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి 60 ఏళ్ల జైలు శిక్షను ల్యారీ అనుభవిస్తున్నాడు.