Kanchi Mutt Junior Pontiff: వివాదంలో చిక్కుకున్న కంచి జూనియర్ పీఠాధిపతి.. మండిపడుతున్న తమిళులు!

  • తమిళగీతం ఆలపించే సమయంలో లేచి నిలబడని విజయేంద్ర సరస్వతి
  • మండిపడుతున్న తమిళులు
  • తమిళమాతకు అవమానం జరిగిందంటూ ఆగ్రహం

కంచి మఠానికి కాబోయే పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తమిళగీతం ఆలపిస్తున్న సమయంలో ఆయన కుర్చీలోనే కూర్చుండిపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే, బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా తండ్రి దివంగత హరిహరన్ రాసిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విజయేంద్ర సరస్వతితో పాటు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తదితరులు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా తమిళగీతాన్ని ఆలపించారు. గవర్నర్ సహా వేదికి మీద ఉన్న అందరూ లేచి నిల్చోగా, విజయేంద్ర సరస్వతి మాత్రం అలాగే కూర్చుండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఆయనపై భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ భాషకు, తమిళ ప్రజలకు, తమిళనాడుకు తీరని అవమానం జరిగిందంటూ ఆయనపై మండిపడుతున్నారు.

ఈ వివాదంపై కంచి మఠం స్పందించింది. ఇది ఒక ప్రార్థనాగీతం లాంటిదని... దీని కోసం లేచి నిలబడాల్సిన సంప్రదాయం లేదని తెలిపింది. అయినా ఆ సమయంలో విజయేంద్ర సరస్వతి ధ్యానంలో ఉన్నారని వెల్లడించింది.

డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా విజయేంద్రపై మండిపడ్డారు. ఆయన వైఖరిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. గవర్నర్ సమక్షంలో ఇలాంటిది చోటు చేసుకోవడం దారుణమని అన్నారు. తమిళమాతకు జరిగిన అవమానమిదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, చివర్లో జాతీయగీతాన్ని ఆలపించినప్పుడు మాత్రం విజయేంద్ర సరస్వతి లేచి నిల్చోవడం గమనార్హం. తమిళనాడులో ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించే సమయంలో తమిళగీతాన్ని విధిగా ఆలపించడం చాలా కాలంగా జరుగుతోంది. 

  • Loading...

More Telugu News