woman: వాయు కాలుష్య ప్రభావం.. అమ్మాయిల్లో రుతుక్రమంలో మార్పులు!
- 14 నుంచి 18 సంవత్సరాల వయసున్న అమ్మాయిల్లో అసహజంగా రుతుక్రమం
- ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని తీరు దెబ్బతినడం
- మెటబాలిక్ సిండ్రోమ్ వంటి వాటి బారిన పడే అవకాశాలు
వాయు కాలుష్యం కారణంగా అమ్మాయిల్లో రుతుక్రమంలో అసమతుల్యత ఏర్పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని బోస్టన్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. వాతావరణంలో కంటికి కనిపించని అతి చిన్న రేణువులు శరీరంలోకి చేరడం వల్ల అమ్మాయిల్లో రుతుక్రమం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని తీరు దెబ్బతినడమే కాకుండా, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి వాటి బారిన పడతారని శాస్త్రవేత్తలు తెలిపారు.
కలుషిత గాలి కారణంగా ముఖ్యంగా, 14 నుంచి 18 సంవత్సరాల వయసున్న అమ్మాయిల్లో రుతుక్రమం దెబ్బతింటోందని శ్రుతి మహాలింగయ్య అనే శాస్త్రవేత్త తెలిపారు. వాయుకాలుష్యానికి గురైన ఉన్నత పాఠశాల విద్యార్థినుల్లో రుతుక్రమం అసహజంగా ఉందని, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని తెలిపారు. మహిళల్లో కొద్ది మొత్తంలో పురుష హార్మోన్లు కూడా ఉంటాయని, వాయు కాలుష్యం కారణంగా వారిలో ఈ హార్మోన్లు ఎక్కువగా విడుదల అవడం జరుగుతుందని, తద్వారా అండాల విడుదల క్రమం తప్పి రుతుక్రమం దెబ్బతింటుందని తెలిపారు.