u-19 world cup: ఐపీఎల్ లో ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాదైనా ఆడొచ్చు...ముందు ఆటపై శ్రద్ధపెట్టండి: అండర్-19 ఆటగాళ్లకు ద్రవిడ్ క్లాస్
- అండర్ 19 భారత జట్టు ఆటగాళ్లపై ద్రవిడ్ ఆగ్రహం
- ఐపీఎల్ వేలంలో తమను తీసుకుంటారో, లేదోనన్న ఆందోళనలో ఆటగాళ్లు
- ఐపీఎల్ పై కాదు... తరువాతి మ్యాచ్ పై దృష్టి పెట్టండంటూ క్లాస్
టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ అండర్-19 క్రికెటర్లకు క్లాస్ పీకాడు. అద్భుత ప్రదర్శనతో అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కు దూసుకెళ్లిన భారత జట్టు ఆటగాళ్లపై మిస్టర్ డిపెండబుల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 30న సెమీఫైనల్ మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరగనుండగా, నేడు (శనివారం) జరగనున్న ఐపీఎల్ వేలంలో తమను పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? ఏ జట్టు తమను కొనుగోలు చేస్తుందోనన్న ఆందోళనలో ఆటగాళ్లు పడ్డారు.
దీనిని గమనించిన రాహుల్ ద్రావిడ్ జూనియర్ ఆటగాళ్లకు...‘వేలంపై కాదు, ఆటపై దృష్టి పెట్టండి. ప్రపంచకప్ లో ఆడే అవకాశం రావడం అదృష్టంగా భావించండి. ఐపీఎల్ మ్యాచ్ లు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా ఐపీఎల్ లో ఆడే అవకాశం రావచ్చు. కానీ ప్రపంచ కప్ లో అలా రాదు’ అంటూ హెచ్చరించాడని తెలుస్తోంది. కాగా, పృథ్వీ షా, గిల్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, హిమాన్షు రానా, నాగర్ కోటి, అర్షదీప్ సింగ్, హార్విక్ దేశాయ్, శివమ్ మావి ఐపీఎల్ వేలానికి అందుబాటులో ఉన్నారు.