Chandrababu: చంద్రబాబునో, నన్నో చూసి పారిశ్రామికవేత్తలు రారు!: జగన్
- ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
- ప్రత్యేక హోదాతోనే అది సాధ్యం
- పదేళ్ల పాటు పన్ను మినహాయింపులు ఉండాలి
రాష్ట్ర విభజనతో ఆర్థికంగా ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ అధినేత జగన్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొహం చూసో లేక తన మొహం చూసో రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ రారని ఆయన అన్నారు. పరిశ్రమలు, హోటల్స్, ఆసుపత్రులు, విద్యాసంస్థలు.. ఇలా ఏవైనా సరే నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అని మాత్రమే చూస్తారని చెప్పారు. మన రాష్ట్రంలో అలాంటి అనుకూల పరిస్థితులు లేవని చెప్పారు. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేముందు... హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని అనువైన పరిస్థితులతో బేరీజు వేసుకుంటారని తెలిపారు. సహజంగానే ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన ఆ ప్రాంతాలకే ఇన్వెస్టర్లు వెళ్లిపోతారని చెప్పారు.
పెట్టుబడి దారులు మన వద్దకు రావాలంటే... ప్రత్యేక హోదా ఉంటేనే అది సాధ్యమని జగన్ తెలిపారు. పదేళ్లపాటు ఆదాయపు పన్ను, జీఎస్టీలో మినహాయింపులు ఉంటేనే పెట్టుబడిదారులు మన వద్దకు వస్తారని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికి 22 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారని... దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, రూ. 250 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయిందని విమర్శించారు. విదేశాలకు వెళ్లడంలో ఉన్న చిత్తశుద్ధి ప్రత్యేక హోదాపై ఉండి ఉంటే మనకు మేలు జరిగేదని చెప్పారు. అడగందే ఎవరూ ఏమీ ఇవ్వరని... ప్రధాని మోదీని చంద్రబాబు కలిసి స్పెషల్ స్టేటస్ కోసం అడిగుంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు.