tenant: ఇల్లు ఖాళీ చేయకుండా యజమానిని 52 ఏళ్ల పాటు ఇబ్బందిపెట్టిన వ్యక్తిపై సుప్రీం ఆగ్రహం!
- ఖాళీ చేయడానికి నెల రోజుల గడువు
- పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ కాలం వెళ్లబుచ్చిన ఎంకే బారోత్
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న ఇంటి యజమాని బీఎం పటేల్
అద్దెకు ఇచ్చిన ఇంటిని ఖాళీ చేయకుండా ఏకంగా 52 ఏళ్ల పాటు ఇంటి యజమానిని ఇబ్బంది పెట్టాడో వ్యక్తి. వివిధ కోర్టుల్లో పిటిషన్లు వేసుకుంటూ పోతూ కాలం వెళ్లబుచ్చాడు. ఇతని తీరు చూసి సుప్రీంకోర్టు ధర్మాసనమే విస్తుపోయింది.
వివరాల్లోకి వెళ్తే... గుజరాత్‌కి చెందిన బీఎం పటేల్ 1965లో తన ఇంటిని ఎంకే బారోత్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. కొన్నాళ్లకు పటేల్ తన ఇల్లు ఖాళీ చేయమని అడగ్గా.. బారోత్ కోర్టులో కేసు వేశారు. అయితే గుజరాత్ కోర్టు పటేల్‌కు ఇల్లు అప్పగించాలని తీర్పు చెప్పింది. కానీ బారోత్ దాన్ని సవాలు చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేసి తీర్పు అమలు కాకుండా ఆపేశాడు. అలా ఏకంగా అయిదు దశాబ్దాల పాటు ఆపుతూ వచ్చాడు. గత ఏడాది హైకోర్టు కూడా బారోత్ ఇల్లు ఖాళీ చేయాలని తీర్పు చెప్పింది. దీంతో బారోత్ ఈ తీర్పును సుప్రీంలో సవాలు చేశాడు.
ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం విస్మయం చెందింది. ఇన్నేళ్ల పాటు ఇల్లు ఖాళీ చేయకుండా ఉండడంపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్న కారణంగా యజమాని తన ఇంటిని స్వాధీనం చేసుకోలేకపోయారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు వెంటనే బారోత్ను ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆరు రోజుల్లోగా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారో చెప్పాలని ఆదేశించింది. బారోత్ ఇల్లు ఖాళీ చేయడానికి ఆరు నెలల గడువు కోరగా కోర్టు నెల రోజుల గడువు మంజూరు చేసింది.