Drunken Drive: డ్రంకెన్ డ్రైవ్ లో పోలీసులకు చుక్కలు చూపించిన ఇద్దరమ్మాయిలు!
- డ్రంకెన్ డ్రైవ్ లో దొరికి పోయిన యువతులు
- బ్రీత్ అనలైజర్ టెస్టుకు సహకరించకుండా మారాం!
- నిబంధనలు ఎవరికైనా ఒకటేనంటున్న పోలీసులు
- శనివారం నాడు పట్టుబడిన 75 మంది
ఇటీవలి కాలంలో మందు కొట్టి వాహనాలు నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్ లో పోలీసులకు దొరికి, వారు చేసే పరీక్షలకు పట్టుబడకుండా చుక్కలు చూపుతున్న అమ్మాయిల సంఖ్య పెరిగిపోతోంది. మగవాళ్ల నుంచి ఎలాంటి సమస్య ఎదురుకావడం లేదని, మహిళలు మాత్రం బ్రీత్ అనలైజర్ టెస్టుకు సహకరించడం లేదని, నిబంధనలు ఎవరికైనా ఒకటేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
గత రాత్రి హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, ఇద్దరు అమ్మాయిలు పట్టుబడ్డారు. తొలుత పరీక్షలకు వీరు ఎంతమాత్రమూ అంగీకరించలేదు. చివరకు మహిళా కానిస్టేబుళ్ల ఒత్తిడితో శ్వాస విశ్లేషణ పరీక్షకు దిగిన వీరు, మోతాదుకు మించి మద్యం సేవించి ఉన్నట్టు నిర్ధారించి కేసులు నమోదు చేశారు. మొత్తం 75 మంది శనివారం నాడు పట్టుబడ్డారని, 38 కార్లు, 37 బైకులను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. వీరికి సోమవారం నాడు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆపై కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద కార్ రేసింగ్ కు పాల్పడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.