ys rajashekar reddy: ‘మా రమణ’ అంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి నాతో చాలా ఆప్యాయంగా ఉండేవారు: కేవీ రమణాచారి
- ‘మా రమణ .. సలహాలు బాగా ఇస్తాడు’ అని వైఎస్ అనేవారు
- వైఎస్ రాత్రి పదకొండు గంటలప్పుడూ ఫోన్ చేసి సలహాలు తీసుకునేవారు
- కేసీఆర్ గారు నాకు చాలా ఆత్మీయులు: రమణాచారి
‘మా రమణ’ అంటూ తనతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా ఆప్యాయంగా ఉండేవారని మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి నాటి విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద పని చేసిన రమణాచారి నాటి సంగతులను ప్రస్తావించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సలహాదారుడిగా ఉన్న ఆయన ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘రాజశేఖర్ రెడ్డి గారు రాజసం, ఆయన చూపించే అభిమానం, ప్రేమ మర్చిపోలేం. ఎవరినైనా రాజశేఖరరెడ్డిగారు ఇష్టపడితే వారి కోసం ఆయన ఎంతదూరమైనా వెళ్తారు. నన్ను ‘మా రమణ .. తెలుగులో బాగా మాట్లాడతాడు. సలహాలు బాగా ఇస్తాడు’ అని రాజశేఖర్ రెడ్డి గారు అనేవారు. రాత్రి పదకొండు గంటలప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి సలహాలు తీసుకునేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డిగారు నాకు ఎంతో ఆత్మీయుడు’ అని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ వద్ద ఆరాధనీయత, చంద్రబాబు వద్ద పనితనం, రాజశేఖర్ రెడ్డి వద్ద ఆప్యాయత ఉన్నాయంటూ ఆ ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పని చేసిన ఆయన తన అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆయన ప్రస్తావిస్తూ, ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు చాలా ఆత్మీయులు. ఆయన నాపై చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం.నాటి తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి కావడం, ఈ రాష్ట్రంలో నాకు పనిచేసే అవకాశం కల్పించిన కేసీఆర్ ఆత్మీయత చాలా గొప్పది’ అని రమణాచారి అన్నారు.