malaysia: మలేషియాలో 'పద్మావత్' సినిమా విడుదలపై నిషేధం
- విడుదల కుదరదని చెప్పిన మలేషియా సెన్సార్ బోర్డ్
- ముస్లింల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలున్నాయని వ్యాఖ్య
- ఇస్లాం మతస్థులు నిరసనలు తెలిపే ప్రమాదం
అష్టకష్టాల మధ్య భారత్‌లో సంజయ్‌లీలా భన్సాలీ 'పద్మావత్' చిత్రం విడుదలై విజయవంతంగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మలేషియాలో మాత్రం ఈ సినిమా విడుదలకు అక్కడి సెన్సార్ బోర్డ్ ఎల్పీఎఫ్ ఒప్పుకోలేదు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయని, మలేషియాలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్న కారణంగా ఈ సినిమా విడుదలకు అంగీకరించడం లేదని ఎల్పీఎఫ్ చైర్మన్ మహ్మద్ జాంబేరీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. సినిమా కథాంశమే ముస్లింల భావాలకు వ్యతిరేకంగా ఉందని ఆయన అన్నారు.
అయితే సినిమాలో హిందువులను కించపరిచే విషయాలున్నాయని భారత్‌లో కర్ణి సేన నిరసనలు, ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. మరో ముస్లిం దేశం పాకిస్థాన్‌లో ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా విడుదలకు అక్కడి సీబీఎఫ్సీ అంగీకరించడం ఏంటో... మళ్లీ ముస్లింలను కించపరిచే కథాంశమంటూ మలేషియాలో నిషేధించడం ఏంటో అర్థంకాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు.