joopally krishna rao: ఇప్పటికే కొత్త జిల్లాలను, మండలాలను ఏర్పాటు చేశాం.. త్వరలో గ్రామాలను కూడా: తెలంగాణ మంత్రి జూపల్లి
- 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది
- ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు
- మేము గ్రామీణాభివృద్ధిలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం
- గ్రామాల రూపురేఖల్ని మార్చేస్తున్నాం
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే తాము కొత్త జిల్లాలను, మండలాలను, ఏర్పాటు చేశామని, త్వరలో గ్రామాలను కూడా ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు కోసం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ రోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు, ఫైనాన్స్ కమిషన్ అధికారుల సదస్సు జరిగింది.
ఈ సదస్సులో ప్రసంగించిన మంత్రి జూపల్లి కృష్ణారావు... స్థానిక సంస్థల బలోపేతం కోసం 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు జరగాల్సిన అవసరం ఉందని, తెలంగాణకి సంబంధించి ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులు సరిపోవడం లేదన్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చిన నిధులను రెండింతలు చేయాలని కోరామన్నారు. తెలంగాణకి సంబంధించి ఇప్పటిదాకా ఇస్తున్న నిధులు గ్రామాల అభివృద్ధికి సరిపోవట్లేదని మంత్రి జూపల్లి తెలిపారు.
గ్రామాలను పటిష్ఠం చేసేందుకు నిధుల పెంపుతో పాటు.. నిధుల వినియోగం, ప్రణాళికలలో చాలా మార్పులు తీసుకురావాల్సి ఉందని మంత్రి వివరించారు. గ్రామ స్వరాజ్యానికి విఘాతం కలగకుండ మూడంచెల వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్ర నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వడం వల్ల, మండల, జిల్లా పరిషత్ వ్యవస్థ నిర్వీర్యం అవుతోందన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులను తగ్గించకుండా జిల్లా, మండల పరిషత్ లకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సూచించామన్నారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా మున్సిపాలిటీల్లో అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నట్లుగానే కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లోనూ అండర్ డ్రైనేజీలు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని కోరినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. వీటితో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని, ఉపాధి హామీ మెటీరియట్ కాంపొనెంట్ నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని కోరామన్నారు.
తెలంగాణలోని గ్రామాలను స్వచ్ఛ - హరిత గ్రామాలుగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఇందుకోసం ప్రతి గ్రామంలోనూ పారిశుద్ధ్య కార్మికులను ఉపాధి నిధులతో ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని కోరామన్నారు. దేశంలోనే గ్రామీణాభివృద్ధిలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరుతో గ్రామాల రూపురేఖల్ని మార్చేస్తున్నారన్నారు.
నాలుగు వేలకు పైగా గ్రామ పంచాయతీల ఏర్పాటుకు చర్యలు
తెలంగాణలో కొత్తగా 4 వేలకు పైగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అదనంగా నిధులు కేటాయించాలని కోరినట్లు మంత్రి తెలిపారు. పాలనలో పారదర్శకత వచ్చేలా గ్రామ పంచాయతీలలోని తీర్మానాలు ఆన్ లైన్లో ఉంచడంతో పాటు గ్రామ సభల వివరాలను కూడా ఆన్లైన్లో పొందుపరిస్తే బాగుంటుందని సూచించామన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి నిధుల వినియోగంలో కొన్ని అంశాలను సరళీకరించి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో కొన్ని అధికారాలు రాష్ట్రాలకు, పంచాయతీలకు ఇస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు.
స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు పెంచి, సకాలంలో విడుదల చేస్తే ఆశించిన ఫలితాలను వేగంగా సాధించవచ్చని మంత్రి తెలిపారు. 24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలోని గ్రామాలపై మంచినీటి సరఫరా, కరెంట్ మోటార్లు కాలిపోతే అయ్యే ఖర్చుల భారాన్ని చాలావరకు తగ్గిస్తున్నామని... ఆర్థిక సంఘం నిధులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.