India: భారత్ వృద్ధి.. సంపన్న దేశాల జాబితాలో భారత్ కు స్థానం!
- వ్యక్తుల ప్రైవేటు ఆస్తులు పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదిక
- 8,230 బిలియన్ డాలర్ల సంపదతో భారత్ కు ఆరో స్థానం
- న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక వెల్లడి
సంపన్న దేశాల జాబితాలో భారత్ కు స్థానం దక్కింది. ప్రతి దేశం లేదా నగరంలో నివసిస్తున్న వ్యక్తుల ప్రైవేటు ఆస్తులు (నగదు, ఈక్విటీ, వ్యాపారం...) పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదికలో భారత్ ఆరో స్థానం దక్కించుకున్నట్టు న్యూ వరల్డ్ వెల్త్ వెల్లడించింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేశారు. 8,230 బిలియన్ డాలర్ల సంపదతో భారత్ కు ఈ స్థానం దక్కింది.
ఈ నివేదిక ప్రకారం 2017లో అమెరికా 64,584 బిలియన్ డాలర్లతో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చైనా 24,803 బిలియన్ డాలర్లు, జపాన్ 19,522 బిలియన్ డాలర్లు, బ్రిటన్ 9,919 బిలియన్ డాలర్లు, జర్మనీ 9,660 బిలియన్ డాలర్లు, భారత్ 8,230 బిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 6,649 బిలియన్ డాలర్లు, కెనడా 6,393 బిలియన్ డాలర్లు, ఆస్ట్రేలియా 6,142 బిలియన్ డాలర్లు, ఇటలీ 4,276 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నాయి. కాగా, 2016లో మన దేశ సంపద 6,584 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది 25 శాతం వృద్ధిని నమోదు చేసుకుని 8,230 బిలియన్ డాలర్లుగా ఉంది.