Uttar Pradesh: నేను చచ్చిపోలేదు...బతికే ఉన్నాను: 'లక్నో అల్లర్ల' ఘటనలో పోలీసులను ఆశ్రయించిన యువకుడు
- రిపబ్లిక్ డే రోజున లక్నోలోని కాస్ గంజ్ లో చెలరేగిన అల్లర్లు
- అభిషేక్ గుప్తా, రాహుల్ ఉపాధ్యాయ్ మరణించినట్టు ప్రచారం
- బతికే ఉన్నానంటూ పోలీసులను ఆశ్రయించిన రాహుల్
కాస్ గంజ్ లో జరిగిన అల్లర్లలో తాను చనిపోలేదని, బతికే ఉన్నానని చెప్పుకుంటూ రాహుల్ ఉపాధ్యాయ్ (24) పోలీసులను ఆశ్రయించాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే... గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ లోని కాస్ గంజ్ లో పలువురు యువకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ఉండే ప్రాంతానికి వెళ్లిన పలువురు యువకులు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో చెలరేగిన వాగ్వివాదం ఘర్షణగా మారింది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. -ఈ అల్లర్లలో అభిషేక్ గుప్తా, రాహుల్ ఉపాధ్యాయ్ చనిపోయారని మీడియాలోను, సోషల్ మీడియాలోను వార్తలు వచ్చాయి. దీంతో రాహుల్ స్నేహితులు, స్థానికులు అతడికి ఫోన్ చేసి ఆరాతీయగా, తాను బతికే ఉన్నానని, తాను మరణించినట్టు ప్రచారం జరుగుతోందని చెప్పిన అతను పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు అభిషేక్ గుప్తా అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలు కోల్పోగా, ఈ అల్లర్లకు సంబంధించి 83 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.