kc krishna murthy: ఏపీలో ఒక్క క్లిక్ తో భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం!
- భూ-సేవ ద్వారా సేవలు-కేఈ కృష్ణమూర్తి
- ఆధార్ తరహాలో ప్రతి భూమికి లేక స్థిరాస్తికి భూధార్
- భూమి రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే వెబ్ ల్యాండ్ లో పట్టాదారు పేరు మార్పు
- రైతుల సమయం ,డబ్బు ఆదా చేసేందుకే ఆటోమ్యుటేషన్ ప్రక్రియ
ఒక్క క్లిక్ తో భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే భూసేవ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, ఏపీలోని పట్టాదారుని భూభాగానికి ఆధార్ తరహాలో భూధార్ విశిష్ట సంఖ్యను అందజేస్తామని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ రోజు అమరావతిలోని సచివాలయం వేదికగా భూ సేవ, ఆటోమ్యుటేషన్ ప్రక్రియకు సంబంధించి రెవెన్యూ ఉన్నతాధికారులు.. ఉప ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో రెవెన్యూ, ఐటీ, ఎన్ఐసీ ఉన్నతాధాకారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ... రాష్ట్రంలో భూవివాదాలు అరికట్టడంతో పాటు రాష్ట్రంలోని భూముల సమగ్ర సమాచారం ఒకే చోట లభ్యమయ్యేలా భూ సేవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్ర ప్రభత్వం ఈ- ప్రగతి ప్రాజెక్టులో భాగంగా భూసేవ పథకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పట్టాదారుని భూభాగానికి జియో ట్యాగింగ్ చేసి 11 అంకెలతో ఒక సంఖ్య ఇస్తారని, ఈ సంఖ్య ఆధారంగా భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.
జియో ట్యాగింగ్ చేసిన వెంటనే 99 సంఖ్యతో ప్రారంభమయ్యే తాత్కాలిక భూధార్ నెంబర్ ఇస్తామని, భూ వివరాలను సమగ్రంగా విశ్లేషించి అవి సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత రాష్ట్ర సెన్సస్ కోడ్ 28 తో ప్రారంభమయ్యే పర్మెనెంట్ భూధార్ నెంబర్ అందిస్తారని అన్నారు. ప్రభుత్వ భూములను సులువుగా గుర్తించే విధంగా విశిష్ట సంఖ్య రెండు సున్నాలతో ప్రారంభం అవుతుందన్నారు. భూ-సేవలో వెబ్ సైట్లో మొత్తం 6 శాఖలకు సంబంధించిన సమాచారం రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, మున్సిపల్, పంచాయతి రాజ్ మరియు అటవీశాఖకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు.
మొత్తం 2 కోట్ల 84 లక్షల వ్యవసాయ భూముల వివరాలతో పాటు 50 లక్షల పట్టణ ఆస్తులు, 85 లక్షల గ్రామీణ ఆస్తుల వివరాలను దీని ద్వారా పొందవచ్చని అన్నారు. జగ్గయ్యపేట మండలంలోని 24 గ్రామాలలోను, ఉయ్యూరు మున్సిపాలిటీలోను ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టు చేపట్టామని ఫిబ్రవరి 15 నాటికి ఇది పూర్తి అవుతుందని, అక్టోబర్ నాటికి రాష్ట్రమంతటా ప్రాజెక్టుని అమలు చేస్తామన్నారు. దేశంలోనే ఈ తరహా ప్రాజెక్టు ఎక్కడా అమలులో లేదని, రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల సమయం, డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతోనే ఆటోమ్యుటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని కేఈ కృష్ణమూర్తి అన్నారు.
ఇందుకోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అనుసంధానం చేస్తున్నామన్నారు. వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాలు జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో ఆటోమేటిక్ గా కొత్త యజమాని పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆటోమ్యుటేషన్ అయిన వెంటనే రైతుకు లేక భూయజమానికి ఎస్ఎంఎస్, ఈ మెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తామన్నారు.
రికార్డులో పేరు నమోదైనప్పటికీ 30 రోజుల వరకు ఎలాంటి లావాదేవీలు జరగకుండా దీనికి నోషనల్ ఖాతా నెంబర్ ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన తరువాత సంబంధిత భూమి రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని, అన్ని అభ్యంతరాలు పరిష్కారం అయిన తరువాతే రెవెన్యూ రికార్డుల్లో శాశ్వత ఖాతా ఇస్తామన్నారు. గడచిన మూడు సంవత్సరాలలో రెవెన్యూ శాఖ లో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. రెవెన్యూ శాఖలో తాము తీసుకొచ్చిన ఈ- పంట, లోన్ ఛార్జ్ క్రియేషన్ మాడ్యూల్ ఈ పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్ కు జాతీయ స్థాయిలో ఈ గవర్నన్స్ క్యాటగిరీ కింద అవార్డులు వచ్చాయన్నారు.