Cheating offence: ఘరానా మోసం... రూ. 3,500ల కోటు గుండీతో కోటీ ఇరవై లక్షలకు టోకరా!
- చార్మినార్ సండే మార్కెట్ లో 3,500 కోటు గుండీ ఖరీదు చేసిన సలాంఖాన్
- స్నేహితుడికి 1,20,00,000 రూపాయలకు అంటగట్టిన వైనం
- వ్యాపారికి విక్రయించే క్రమంలో వెలుగు చూసిన నమ్మకద్రోహం
హైదరాబాద్ లో ఘరానామోసం వెలుగు చూసింది. 3,500 రూపాయల విలువ చేసే కోటు గుండీని కోటీ ఇరవై లక్షల రూపాయలకు అంటగట్టాడో మోసగాడు. ఆ వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదులోని అసిఫ్ నగర్ కు చెందిన మహ్మద్ అక్తర్ సిద్ధిఖీ (52), మెదక్ జిల్లాలోని బీహెచ్ఈఎల్ ఆర్సీ పురానికి చెందిన మహ్మద్ సలాంఖాన్ (39) వృత్తి పరంగా స్నేహితులు. రంగు రాళ్లు, ముత్యాలు వంటి ఆభరణాలకు వినియోగించే వస్తువులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. 2016లో సలాంఖాన్ తన తమ్ముడు జుబేర్ ఖాన్ ను ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా పంపించాడు. అక్కడ అతడికి ఉద్యోగం దొరక్కపోవడంతో ఖర్చుల కోసం అన్న సలాంఖాన్ ను డబ్బు పంపమని అడిగేవాడు. దీంతో తెలిసిన వారిదగ్గర అప్పులు చేసి తమ్ముడి ఖర్చులకు డబ్బులు పంపేవాడు. ఇదే సమయంలో అతని వ్యాపారం సరిగా జరగక నష్టాలు వచ్చాయి.
దీంతో స్నేహితుడు అక్తర్ సిద్దిఖీతో కలిసి ప్లాన్ వేసి, ఈ నెల 14న చార్మినార్ సండే మార్కెట్ లో 3,500 రూపాయలతో నకిలీ డైమండ్ కొన్నాడు. సనత్ నగర్ కు చెందిన షేక్ హాజీ (1996 నుంచి 2000 వరకు నాంపల్లిలోని మొహ్మద్ ఖాన్ జువెల్లర్స్‌లో తనతో పాటు సేల్స్‌మెన్‌గా పనిచేసిన వ్యక్తి) ని ‘‘మా దగ్గర చాలా విలువైన వజ్రం ఉంది. దాని ఖరీదు 25 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొనుగోలు చేసే వాళ్లు లేరు. కానీ, ఇప్పుడు నాకు కొంత డబ్బు అత్యవసరంగా కావాలి. అందువల్ల ఆ డైమండ్‌ను అమ్మే వరకు నీ దగ్గరే ఉంచుకో. అమ్మాక మనం వాటాలు తీసుకుందాం. ఇప్పుడు నాకు ఎక్కడైనా అప్పు తెచ్చి రూ. 2 కోట్లు ఇవ్వు’’ అని సలాం ఖాన్ నమ్మబలికాడు.
ఇద్దరూ ఒకే చోట పనిచేసినవాళ్లు, రంగురాళ్ల బిజినెస్ లో ఉన్నవారు కావడంతో సలాం ఖాన్ మాటలను షేక్ హజీ నమ్మాడు. మాట్లాడుకున్న ప్రకారం వజ్రంతో సలాంఖాన్, అక్తర్ సిద్ధిఖీ అబిడ్స్-నాంపల్లి రోడ్డులోని స్వదేశ్ లాడ్జికి చేరుకున్నారు. కాసేపటికి డబ్బుతో షేక్ హజీ కూడా చేరుకున్నాడు. రెండు కోట్లు దొరకలేదని, కోటీ 20 లక్షల రూపాయలు మాత్రమే దొరికాయని హాజీ చెప్పాడు.
తర్వాత కాసేపు వజ్రాన్ని పరీక్షించి నిజమైనదేనని తేల్చి, హాజీ నుంచి అతను తెచ్చిన కోటీ 20 లక్షల రూపాయలు తీసుకుని స్నేహితులిద్దరూ వెళ్లిపోగా, వాళ్లు డబ్బు ఎగ్గొట్టినా తన వద్ద 25 కోట్ల వజ్రం ఉందన్న ఆనందంతో షేక్ హాజీ వెళ్లిపోయాడు. వారం తరువాత బయ్యర్ల సంగతేంటని సలాంఖాన్ ను షేక్ హాజీ నిలదీయగా, ఇంకా దొరకలేదని దాటవేశాడు. దీంతో తనకు డబ్బులు అప్పుఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండడంతో షేక్ హాజీ దానిని విక్రయించేందుకు మార్కెట్ కు వెళ్లాడు.
దానిని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన షాపువారు దానిని పరీక్షించి, అది డైమండ్ కాదని, కోటుకు వాడే ఖరీదైన గుండీ అని తేల్చారు. దీంతో స్నేహితుడి చేతిలో తాను మోసపోయానని గుర్తించిన షేక్ హాజీ అబిడ్స్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో సలాంఖాన్, అక్తర్ సిద్దిఖీలను పట్టుకుని వారి నుంచి 1,15,20,000 రూపాయల నగదు, వజ్రాన్ని పరీక్షించే పరికరం, వజ్రాన్ని సరితూచే ఎలక్ట్రికల్ మెషిన్, ఆల్ట్రావయోలెట్ రేస్ మెషిన్, టేబుల్ డైమండ్ సెక్టార్ లైట్, కెనాన్ జువెలరీ లెన్స్, డైమండ్ క్లిప్పర్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.