Parliament: వరాలా? వడ్డింపులా? కేంద్ర బడ్జెట్ పై కొన్ని లీక్ లు!
- నేడు పార్లమెంట్ ముందుకు బడ్జెట్
- ఉదయం 11 గంటలకు ప్రతిపాదించనున్న అరుణ్ జైట్లీ
- కోటి ఆశలు పెట్టుకున్న సామాన్యుడు
- 2019 ఎన్నికల ముందు చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే
కోట్లాది మంది భారత ప్రజల ఆశల పద్దుకు సమయం ఆసన్నమైంది. 2018-19 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఉదయం 11 గంటల సమయంలో పార్లమెంట్ ముందుకు తేనున్నారు. బడ్జెట్ పై దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి వరాలు లభిస్తాయి? ఎవరిపై వడ్డింపులు ఉంటాయన్న విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు.
జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడం, వచ్చే సంవత్సరంలో 8 రాష్ట్రాల అసెంబ్లీలకు, కేంద్రానికి ఎన్నికలు జరుగనుండటంతో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఇదే కావడంతో, ఈ ప్రతిపాదనలు ప్రజాకర్షకంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగానే జరగవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో, బడ్జెట్ లో తాయిలాలు అధికంగానే ఉంటాయని అంచనా.
ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ బడ్జెట్ లో ఆర్థిక వ్యవస్థ మెరగునకు, రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులపై ఉన్న భారాన్ని కొంతమేరకు తగ్గిస్తూ, ఆదాయపు పన్ను శ్లాబ్స్ స్వల్పంగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ, ఈ బడ్జెట్ లో గిట్టుబాటు ధర, పంటల బీమా తదితరాలపై కీలక ప్రకటనలు వెలువడనున్నాయి.
వచ్చే సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని మరింతగా తగ్గించడమే లక్ష్యమంటూ పార్లమెంట్ ముందుకు వచ్చిన ఆర్థిక సర్వే స్పష్టం చేసిన నేపథ్యంలో, జైట్లీ వెలువరించే నిర్ణయాలపైనా ఆసక్తి నెలకొంది. వ్యవసాయం వంటి రంగాల్లో పెట్టుబడులను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నందున ద్రవ్యలోటును 3.2 శాతం వరకూ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వ బాండ్లపై కనీసం పావు శాతం వరకూ నష్టాన్ని భరించాల్సి వుంటుందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇక గత నాలుగేళ్లలో వృద్ధి రేటు గణనీయంగా తగ్గడం, అది కూడా ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాతనే అంటూ విపక్షాలు విమర్శిస్తుండటంతో, వృద్ధి రేటు పెంపు లక్ష్యంగా జైట్లీ పలు కీలక ప్రతిపాదనలను తీసుకు రానున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ సంవత్సరం ప్రభుత్వ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా కనీసం లక్ష కోట్ల రూపాయలను ఖజానాకు చేర్చాలన్న గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఓ రోడ్ మ్యాప్ ను జైట్లీ ప్రకటించనున్నారని సమాచారం.
జాతీయ రహదారులు, రైల్వేల ఆధునికీకరణ తదితరాల నిమిత్తం గత సంవత్సరం బడ్జెట్ లో 3.96 లక్షల కోట్లను కేటాయించిన జైట్లీ, ఈ సంవత్సరం దాన్ని మరింత పెంచుతారని తెలుస్తోంది. కార్పొరేట్ టాక్స్ ను ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం వంటి కొన్ని మార్కెట్ వర్గాలకు అనుకూల నిర్ణయాలు కూడా ఉంటాయని సమాచారం.