Hyderabad: పడిపోతున్న హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సంఖ్య.. త్వరలో మెట్రో వేగం పెంపు!
- రెండు నెలల్లో 70 వేలకు పడిపోయిన మెట్రో ప్రయాణికుల సంఖ్య
- సరదాగా చూసేందుకే రైలు ఎక్కుతున్న నగరవాసులు
- త్వరలోనే ఆరు నిమిషాలకో రైలు నడుపుతామన్న మెట్రో ఎండీ
- మియాపూర్లో మెట్రో బైక్ సేవలు ప్రారంభం
హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి వచ్చి రెండు నెలలు అయింది. తొలి రోజుల్లో కిక్కిరిసిన మెట్రో రైళ్లు ఇప్పుడు ప్రయాణికులు లేక పలుచబడిపోతున్నాయి. మొదట్లో రోజుకు సగటున 1.13 లక్షల మంది ప్రయాణం చేయగా రెండు నెలల తర్వాత ఇప్పుడు ఆ సంఖ్య 70 వేలకు పడిపోయింది. సరదా కోసం మెట్రో ఎక్కేవారు తప్పితే నిత్య ప్రయాణికులు అటువైపు చూడడం మానేశారు. అందుబాటులో లేని టికెట్ల ధరలు ఒక కారణమైతే, అన్ని మార్గాల్లోనూ మెట్రో అందుబాటులో రాకపోవడం ఇందుకు మరో కారణం.
బుధవారం మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైలు ఎండీ ఎస్వీఎస్ రెడ్డి మెట్రో బైక్ సేవలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 7 నుంచి రైలు వేగాన్ని పెంచనున్నట్టు తెలిపారు. అలాగే అనుమతి రాగానే మియాపూర్, నాగోలు మార్గాల్లో ఆరున్నర నిమిషాలకో రైలు నడుపుతామన్నారు. ప్రస్తుతం మియాపూర్ మార్గంలో 8 నిమిషాలు, నాగోల్ రూట్లో ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు నడుస్తోంది.
తగ్గుతున్న ప్రయాణికుల సంఖ్యపై ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. చెన్నైలో మెట్రో ప్రారంభించి మూడేళ్లు అయినా ఇప్పటికీ రోజువారీ ప్రయాణికుల సంఖ్య 25 వేలకు దాటలేదని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రోలో సరదాగా ఎక్కేవారు పెరిగారని తెలిపారు. మిగతా మార్గాల్లోనూ త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. మెట్రో పాసులపై కసరత్తు చేస్తున్నట్టు ఎల్ అండ్ టీ మెట్రో సీవోవో అనిల్ కుమార్ సైనీ తెలిపారు.