Budget: ఇంగ్లీషుతో పాటు హిందీ కూడా... తన ఐదో బడ్జెట్ లో 70 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా నడిచిన అరుణ్ జైట్లీ!

  • పార్లమెంట్ ముందుకు వచ్చిన బడ్జెట్
  • ఇంగ్లీష్, హిందీలో సాగుతున్న జైట్లీ ప్రసంగం
  • బడ్జెట్ పై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయన్న జైట్లీ
  • తన ప్రతిపాదనలు వృద్ధి రేటును పెంచుతాయని హామీ

తన జీవితంలో పార్లమెంట్ లో ఐదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన అరుణ్ జైట్లీ, 70 సంవత్సరాల సంప్రదాయానికి స్వస్తి పలికారు. ఇప్పటివరకూ బడ్జెట్ ప్రసంగాలు ఆంగ్లంలోనే సాగగా, జైట్లీ కొంత ఆంగ్లం, కొంత హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మధ్యమధ్యలో ఆయన హిందీలోనూ మాట్లాడుతున్నారు. నాలుగేళ్ల క్రితం తమ ప్రభుత్వం పేదరికాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చామని ఆయన గుర్తు చేశారు.

అప్పట్లో దేశం విధానపరమైన నిర్ణయాలు, సంస్కరణల అమలులో వెనుకబడి ఉందని అన్నారు. మోదీ నాయకత్వంలో ఎన్నో కీలక సంస్కరణలు అమలులోకి తీసుకువచ్చామని తెలిపారు. విదేశీ పెట్టుబడులు పెరిగాయని, పారదర్శక విధానంలో సహజ వనరులను కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విభజన లేకుండా బడ్జెట్ ఉంటుందని ముందే చెప్పిన ఆయన, ఈ బడ్జెట్ పై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయన్న సంగతి తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి ఫలాలను అందరికీ పంచడంతో పాటు, వృద్ధి రేటును పెంచేందుకు తీసుకున్న నిర్ణయాలను బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపరిచామని తెలిపారు. జీఎస్టీ అమలు కారణంగా వృద్ధి రేటు తగ్గడం తాత్కాలికమేనని, సమీప భవిష్యత్తులో వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందన్న నమ్మకం తనకుందని జైట్లీ పేర్కొన్నారు.

 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుందని, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. సరాసరిన 7.5 శాతం వృద్ధిని సాధించామని, ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని గుర్తు చేశారు. లంచగొండితనం, అవినీతి, నల్లధనాన్ని నిరోధించేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృత నిశ్చయంతో అడుగులు వేస్తోందని తెలిపారు. జైట్లీ ప్రసంగానికి ముందు సభ మహారాష్ట్ర ఎంపీ చింతామణి మృతికి పార్లమెంట్ సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించింది.

  • Loading...

More Telugu News