aung san suki: ఆంగ్ సాన్ సూకీ నివాసంపై పెట్రోలు బాంబు విసిరిన దుండగుడు!
- యాంగాన్ లోని ఆమె నివాసంపై పెట్రోల్ బాంబు
- సంఘటన జరిగిన సమయంలో నివాసంలో లేని సూకీ
- స్వల్ప నష్టం వాటిల్లింది: ఎన్ఎల్ డీ పార్టీ నేత కీ టో వెల్లడి
మయాన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ నివాసంపై గుర్తుతెలియని వ్యక్తి ఒకరు పెట్రోల్ బాంబు దాడికి పాల్పడ్డాడు. మయాన్మార్ రాజధాని యాంగాన్ లోని ఆమె నివాసంపై ఈ రోజు ఈ దాడి జరిగిందని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్ డీ) పార్టీ నేత కీ టో తెలిపారు. ఈ దాడిలో స్వల్ప నష్టం వాటిల్లిందని, ఈ సంఘటనకు పాల్పడిన నిందితుడి కోసం తమ సెక్యూరిటీ బలగాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు.
కాగా, ఈ దాడిని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఝా హెచ్ టయూ ధ్రువీకరించారు. అనుమానిత నిందితుడు పింక్ టీ-షర్ట్, లుంగీ ధరించినట్టు తెలుస్తోందని అన్నారు. కాగా, ఈ సంఘటన జరిగినప్పుడు ఎన్ఎల్ డీ అధినేత సూకీ తన నివాసంలో లేరు. పార్లమెంట్ లో ప్రసంగిస్తున్నారు.