Botsa Satyanarayana: మేము అప్పుడే చెప్పాం!: బడ్జెట్‌పై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ
- కేవలం ఒట్టి మాటలతోనే కాలయాపన చేశారు
- హోదా విషయంలో కూడా ఇలాగే చేశారు
- రాష్ట్ర ప్రభుత్వం వల్ల బడ్జెట్లో ఏ మాత్రం లాభం కలగలేదు
- చంద్రబాబు స్వార్థ పూరిత ఆలోచనల వల్ల, అవినీతి వల్ల రాష్ట్రం నష్టపోతోంది
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఏపీకి అన్యాయం జరిగిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేవలం ఒట్టి మాటలతోనే ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసిందని, ఏపీకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకపోవడంపై టీడీపీ మొసలి కన్నీరు కార్చుతోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇలాగే చేశారని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వల్ల బడ్జెట్లో ఏ మాత్రం లాభం కలగలేదని అన్నారు.
చంద్రబాబు స్వార్థ పూరిత ఆలోచనల వల్ల, అవినీతి వల్ల రాష్ట్రం నష్టపోతోందని బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే పాటుపడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోన్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పడం లేదని అన్నారు. టీడీపీ కేసుల భయంతో ఉందని ఆరోపించారు. రాష్ట్రం నష్టపోతోందని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని అన్నారు. రాష్ట్రానికి నష్టం జరుగుతోందని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవాలని చెప్పామని, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ కోసం తమ పార్టీ ఉద్యమాలు చేసిందని, వాటిని అణగదొక్కడానికి చూశారని తెలిపారు. 'అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు' అనేలా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని తెలిపారు.