Cricket: ‘ఆటపై దృష్టి పెట్టండి.. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయండి’ అంటూ రాహుల్ ద్రవిడ్ ఆదేశాలు
- భారత్ - ఆస్ట్రేలియా అండర్ -19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ రేపు
- ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా నిర్ణయం
- ప్రధాన మ్యాచ్ లకు ముందు ఫోన్లు మాట్లాడవద్దని ద్రవిడ్ ఆదేశం
భారత్ - ఆస్ట్రేలియా అండర్ -19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేయాలని అండర్ -19 భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదేశాలు జారీ చేశాడు. అండర్ -19 ప్రపంచకప్ లో ఆడే అవకాశం రెండేళ్లకోసారి మాత్రమే వస్తుంది కనుక, ఆటపై దృష్టి పెట్టాలని ద్రవిడ్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.
కాగా, అండర్ -19 టీమిండియా ఆటగాడు శివమ్ మావి తండ్రి పంకజ్ మావి ఈ విషయమై మాట్లాడుతూ, పాక్ తో సెమీఫైనల్ అనంతరం, మా అబ్బాయికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చిందని అన్నారు. ప్రధాన మ్యాచ్ లకు ముందు ఫోన్లో ఎవరితోనూ మాట్లాడవద్దని ద్రవిడ్ ఆదేశాలు జారీ చేసినట్టు తమ కుమారుడు తనతో అన్నట్టు పంకజ్ పేర్కొన్నారు. కాగా, రేపు ఉదయం 6.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ఈ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది..