ayodhya: అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించే ముస్లింలు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకు వెళ్లిపోండి: యూపీ షియా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
- అటువంటి వారికి దేశంలో చోటు లేదు
- మసీదు పేరుతో జిహాదీ చేసే వారు వెళ్లి ఐఎస్ఐఎస్ లో చేరండి
- దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం
ఉత్తరప్రదేశ్ లోని షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీమ్ రజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించే ముస్లింలు పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు వెళ్లిపోవాలని సూచించారు. బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదంపై ఈ నెల 8 నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ప్రార్థన చేసిన అనంతరం రజ్వీ రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ ను కలుసుకున్నారు.
‘‘ఈ సందర్భంగా రజ్వీ మాట్లాడుతూ... ’’అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించే వారు, బాబ్రీ మసీదు నిర్మించాలని కోరుకునే వారు, ఆ తరహా హేతువాద మనస్తత్వం కలిగిన వారు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకు వెళ్లిపోవాలి. అటువంటి ముస్లింలకు భారత్ లో చోటు లేదు’’ అని పేర్కొన్నారు. మసీదు పేరుతో జిహాదీని వ్యాప్తి చేసే వారు వెళ్లి ఐఎస్ఐఎస్ దళాల్లో చేరిపోవాలని సూచించారు.
హేతువాద ముస్లిం మత గురువులు దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, అటువంటి వారు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వెళ్లిపోవాలని అన్నారు. అయితే, రిజ్వి వ్యాఖ్యలపై షియా మతగురువులు మండిపడ్డారు. ఆయనని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.