Chandrababu: మా అత్తగారు కేన్సర్ వ్యాధితో చాలా ఇబ్బంది పడ్డారు: చంద్రబాబునాయుడు
- గుంటూరులో ఒమెగా కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం
- నవ్యాంధ్రలో కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం శుభపరిణామం
- ప్రపంచంలోనే అద్భుతమైన మెడికల్ హబ్ గా అమరావతి మారబోతోంది : చంద్రబాబు
గుంటూరులో ఒమెగా కేన్సర్ ఆసుపత్రిని సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం పద్దెనిమిది రోజుల్లోనే ఒమెగా కేన్సర్ ఆసుపత్రికి ఏపీఐసీసీ అనుమతి లభించిందని అన్నారు. నవ్యాంధ్రలో కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య, తన అత్తయ్య బసవతారకం గురించి ఆయన ప్రస్తావించారు. తమ అత్తగారు క్యాన్సర్ వ్యాధితో చాలా ఇబ్బందులు పడ్డారని, ఆ ఇబ్బంది ఎవరూ పడకూడదనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ లో బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని ఎన్టీఆర్ నాడు స్థాపించారని అన్నారు. ఇక ప్రపంచంలోనే అద్భుతమైన మెడికల్ హబ్ గా అమరావతి మారబోతోందని, ఇప్పటికే 14 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని అన్నారు.