medaram: మేడారం జాతర పరిసమాప్తి... దేవతల వనప్రవేశ సమయంలో భావోద్వేగాలకు గురైన భక్తులు!
- సమ్మక్క,సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వన ప్రవేశం
- ఆదివాసీల సంప్రదాయం ప్రకారం క్రతువును ముగించిన పూజారులు
- అంతకు ముందు నిలువెత్తు బంగారం సమర్పించిన మంత్రి ఈటల
ఆసియాలోనే అతి పెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను పూజారులు వన ప్రవేశం చేయించారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దేవతల వనప్రవేశ సమయంలో భక్తులు భావోద్వేగాలకు గురయ్యారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం పూజారులు ఈ క్రతువును ముగించారు.
అంతకు ముందు పలువురు తెలంగాణ మంత్రులు, అధికారులు సమ్మక్క సారలమ్మలను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిలువెత్తు బంగారం (బెల్లం)ను వన దేవతలకు సమర్పించుకున్నారు. అడవిలో ఉండికూడా తమ జాతికోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలని ఈటల రాజేందర్ అన్నారు.
వారి పోరాటం హక్కుల కోసం పోరాడే ఎంతోమందికి స్ఫూర్తి అని, కోట్లాదిమంది మొక్కులు అందుకున్న వన దేవతలు తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని తాను కోరుకున్నట్లు ఈటల తెలిపారు. ఇక్కడికి వస్తున్న భక్తులకోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, చెప్పిన ప్రకారమే అన్ని సదుపాయాలు కల్పించి జాతరను సమర్థవంతంగా జరిపించామని చెప్పారు.