Asaduddin Owaisi: హర్యానాలో కశ్మీర్ యువకులపై దాడి.. మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ
- హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటోన్న ఇద్దరు యువకులు
- నిన్న మసీదులో ప్రార్థనలు జరిపి వస్తుండగా దాడి
- భారత్‌లో కశ్మీర్ అంతర్భాగం-అసదుద్దీన్
- ఇటువంటి దాడి జరిపి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
హర్యానాలోని మహేంద్రగఢ్‌లో ఇద్దరు కశ్మీర్ యువకులపై 15 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో ఆ ఇద్దరు కశ్మీర్ యువకులు జియోగ్రఫీ కోర్సు చేస్తున్నారని, నిన్న ఓ మసీదులో ప్రార్థనలు చేసి, ఓ మార్కెట్‌కి వెళ్లిన ఆ ఇద్దరు యువకులపై ఓ గ్రూప్ కర్రలతో దాడికి దిగిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో పలువురిని అరెస్టు చేశామని చెప్పారు.
కాగా, కశ్మీర్ యువకులపై దాడి జరగడాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. హర్యానాలో ప్రజలకు భద్రత కల్పించడంలో ఖట్టర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని అన్నారు. భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని, ఆ రాష్ట్ర పౌరులపై దాడి జరిపి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పౌరులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఇటువంటి తీరును ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.