Gayathri: ‘గాయత్రి’ టైటిల్ నాకు నచ్చలేదు.. శ్రియను పొగడలేదు: మోహన్‌బాబు
- నా జీవితంలో ఎవరినీ పొగడలేదు
- శ్రియను అభినందించానంతే
- విష్ణు నచ్చజెప్పడం వల్లే సినిమా టైటిల్‌ను అంగీకరించా
- ఓ ఇంటర్వ్యూలో కలెక్షన్ కింగ్
విలక్షణ నటుడు మోహన్‌బాబు నటించిన ‘గాయత్రి’ విడుదలకు సిద్ధమైంది. మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్‌బాబు నాయకుడిగా, ప్రతినాయకుడిగా రెండు విభిన్న పాత్రలు పోషించారు. చాలా కాలం తర్వాత ఆయన నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కలెక్షన్ కింగ్’ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.
‘గాయత్రి’ వందశాతం అద్భుతమైన కథ కాబట్టే అంగీకరించినట్టు మోహన్‌బాబు తెలిపారు. ఇందులో విష్ణు ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించాడని, క్రమశిక్షణ కలిగిన నటుడని కితాబిచ్చారు. ‘గాయత్రి’ టైటిల్ తనకు కానీ, దర్శకుడు మదన్‌కు, రచయిత డైమండ్ రత్నబాబుకు కానీ తొలుత నచ్చలేదని, ఒక్క పరుచూరి గోపాలకృష్ణకు మాత్రం నచ్చిందని మోహన్‌బాబు పేర్కొన్నారు. అయితే ‘గాయత్రి’ పేరు వెనక ఉన్న పురాణ కథను చెప్పి విష్ణు నచ్చజెప్పడంతో సరే అన్నట్టు చెప్పుకొచ్చారు. చాలా ఏళ్ల తర్వాత సంతృప్తినిచ్చే పాత్ర చేశానని మోహన్‌బాబు వివరించారు.
పొగడ్తలకు ఆమడ దూరంలో ఉండే మోహన్‌బాబు ఆడియో ఫంక్షన్‌లో నటి శ్రియను పొగడడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. శ్రియతో తనకు పెద్దగా పరిచయం లేదని అన్నారు. ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లో శివాజీ భార్యగా నటించిందని, ఆ పాత్రను ఒప్పుకోవడమంటే సవాలును స్వీకరించడమేనని పేర్కొన్నారు. ఆ పాత్రను అద్భుతంగా చేసిందని ప్రశంసించారు. షూటింగ్‌లో క్రమశిక్షణతో తన పని తాను చేసుకుపోయేదని, అందుకనే ఆమెను అభినందించానని వివరించారు. తానెవరినీ పొగడనని, అభినందన వేరు, పొగడ్త వేరు అని మోహన్‌బాబు స్పష్టం చేశారు.