Padmaavat: ‘పద్మావత్’ను పొగిడిన ఫలితం.. కర్ణిసేన వైస్ ప్రెసిడెంట్‌పై వేటు!
- ‘పద్మావత్’ సినిమా చాలా బాగుందని ప్రశంసించిన మహారాష్ట్ర యూనిట్ ఉపాధ్యక్షుడు
- ఆందోళనలు విరమిస్తున్నట్టు ప్రకటన
- సస్పెండ్ చేసిన కర్ణిసేన జాతీయ విభాగం
‘పద్మావత్’ సినిమాపై నెలల తరబడి ఆందోళనలు చేసి, సినిమాను నిషేధించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేసిన కర్ణిసేన ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని సినిమా చాలా బాగుందని ప్రకటించింది. సినిమాపై చేస్తున్న ఆందోళనలను విరమిస్తున్నట్టు శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన మహారాష్ట్ర యూనిట్ ప్రకటించింది.
మహారాష్ట్ర యూనిట్ ప్రకటనపై కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి మాట్లాడుతూ.. సినిమా చూసిన వారు తమ వ్యక్తిగత అభిప్రాయం చెప్పారని, సినిమాపై ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కర్ణిసేనలో మొత్తం 8 గ్రూపులు వుండగా, రెండు గ్రూపులు ‘పద్మావత్’పై ఆందోళనలు చేపట్టాయి. సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి.. లోకేంద్ర సింగ్ కల్వి శ్రీ రాజ్పుట్ కర్ణిసేనకు చెందిన వారు. ‘పద్మావత్’పై తొలుత ఆందోళనలు చేపట్టిన ఆయన తర్వాత తన సొంతంగా ఓ కర్ణిసేనను ప్రారంభించారు.
కాగా, గోగమేడి ఆదేశాలతోనే తమ సభ్యుడు సినిమాను చూసినట్టు మహారాష్ట్ర యూనిట్ ప్రకటించింది. సినిమా చాలా బాగుందని, రాజపుత్రుల గురించి గొప్పగా చూపించారని మహారాష్ట్ర యూనిట్ నేత యోగేంద్ర సింగ్ కటార్ ప్రశంసించారు. ఆయన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణిసేన జాతీయ యూనిట్ యోగేంద్ర సింగ్‌ను సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది.