Narendra Modi: సుష్మా స్వరాజ్ ఆలోచనంతా ఎన్నికలపైనే ఉంటే ఇంతేమరి!

  • 'పరీక్షలు' అనడానికి బదులు 'ఎన్నికలు' అంటూ సుష్మ ప్రసంగం
  • మూడుసార్లు తప్పులో కాలేసిన కేంద్ర మంత్రి
  • మోదీ రాసిన 'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకా విష్కరణలో ఘటన

కర్ణాటక సహా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఎలాగన్న విషయాన్నే ఆలోచిస్తూ ఉన్నారేమో... కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, 'పరీక్షలు' అనడానికి బదులుగా 'ఎన్నికలు' అనేశారు. ఒకసారి కాదు... మొత్తం మూడుసార్లు 'ఎగ్జామ్స్' అనాల్సిన చోట 'ఎలక్షన్స్' అని తప్పులో కాలేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రచించిన 'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకాన్ని మరో కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ తో కలసి సుష్మ ఆవిష్కరించిన వేళ, ఈ ఘటన జరిగింది.

ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేలా మాట్లాడే క్రమంలో సుష్మ పలుమార్లు ఎన్నికలను ప్రస్తావించడంతో, ఆహూతులంతా విస్తుపోయారు. 'మార్చి నెల పరీక్షలకు సమయం' అనబోయి, 'మార్చి నెల ఎన్నికల సమయం' అన్నారు. అలా మూడుసార్లు తప్పు మాట్లాడిన ఆమె, తనను తాను సమర్థించుకుంటూ తమ మనసుల్లోకి తరచూ ఎన్నికలు వస్తూనే ఉంటాయని చెప్పారు.

విద్యార్థుల జీవితాల్లో అత్యంత క్లిష్టమైన సమయం పరీక్షలేనని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, విద్యార్థుల కోసం 25 సూత్రాలను ఈ పుస్తకంలో వివరించారని, వాటిని ఫాలో కావాలని కోరారు. ఇక సుష్మ ఆలోచనంతా ఎన్నికల చుట్టూనే తిరుగుతూ ఉంటే ఇంతే కదా? అని అక్కడికి వచ్చిన వారు చర్చించుకోవడం కనిపించింది.

  • Loading...

More Telugu News