ksrtc: 70 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని లాక్కెళ్లిన కర్ణాటక ఆర్టీసీ బస్సు!
- డిపోకు చేరిన తర్వాత వెలుగు చూసిన విషయం
- డ్రైవర్ అరెస్ట్, కేసు నమోదు
- ఈ తరహా ఘటన మొదటిసారంటున్న అధికారులు
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ కు చెందిన ఓ ఆర్టీసీ బస్సు ఓ మనిషి ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా, మృత దేహాన్ని 70 కిలోమీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో బెంగళూరు శాంతినగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ మోహినుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నాన్ ఏసీ స్లీపర్ బస్సు తమిళనాడులోని కూనూరు నుంచి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మైసూరు, మాండ్య, చెన్నపట్న మార్గంలో బెంగళూరుకు వెళుతోంది. బెంగళూరుకు చెన్నపట్న 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బస్సు ఓ రాయిని ఢీకొన్నట్టు డ్రైవర్ గుర్తించాడు. అద్దంలోంచి చూడగా వెనుక ఏమీ కనిపించలేదు. దాంతో బస్సును ఆపకుండా అలానే ముందుకు పోనిచ్చాడు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో బస్సు బెంగళూరులోని మైసూర్ శాటిలైట్ బస్ స్టేషన్ కు చేరుకుంది. ఆ తర్వాత మేజిస్టిక్ సెంటర్ కు, అక్కడి నుంచి శాంతినగర్ డిపోకు చేరింది. డ్రైవర్ బస్సును పార్క్ చేసి వెళ్లిపోయాడు. ఉదయం 8 గంటల సమయంలో బస్సును శుభ్రం చేస్తున్న సమయంలో సిబ్బంది బస్సు కింది భాగంలో మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. ఈ సమాచారం పోలీసులకు అందించడంతో వారు డ్రైవర్ మోహినుద్దీన్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని 100, 200 మీటర్లు లాక్కెళ్లిన ఘటనల గురించి విన్నాం గానీ, ఈ తరహా ప్రమాదం గురించి మొదటి సారి వింటున్నామని ఆర్టీసీ అధికారులే చెప్పడం గమనార్హం. మృతుడ్ని ఇంకా గుర్తించాల్సి ఉంది.