KVP Ramachandra Rao: నన్ను పిచ్చోడంటారా?... నిజమే!: కురియన్ కు కేవీపీ భావోద్వేగపు లేఖ
- కేవీపీకి పిచ్చిపట్టిందన్న కురియన్
- ఏపీకి జరుగుతున్న అన్యాయం చూసి పిచ్చోడిగా మారానన్న కేవీపీ
- ఇక మౌనంగా ఉండబోనని హెచ్చరిస్తూ లేఖ
రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్ తనను పిచ్చోడని సంబోధించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. కురియన్ పేరిట బహిరంగ లేఖను రాసిన ఆయన, తనను తీవ్రంగా అవమానించారని, అయినా తాను బాధపడటం లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, రాజ్యసభ పోడియంలోకి కేవీపీ దూసుకెళ్లిన సమయంలో కురియన్ తీవ్రంగా స్పందిస్తూ, మీకేమైనా పిచ్చిపట్టిందా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కురియన్ వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయని అన్న కేవీపీ, హక్కుల సాధనకై పోరాడుతున్న ఏపీ ప్రజల్ని అవమానించారని ఆరోపించారు. తాను పిచ్చోడినే అయ్యానని, ఏపీకి జరిగిన అన్యాయం చూసి అలా మారిపోయానని తాను రాసిన లేఖలో కేవీపీ వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ సంప్రదాయాలకు కట్టుబడే తాను మౌనంగా ఉండిపోయానని, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించినా మౌనంగానే ఉన్నానని, లోక్ సభ ఆర్డర్ లో లేని వేళ, విభజన బిల్లును ఆమోదించినా మౌనంగా ఉన్నానని, ఇకపై అలా ఉండబోనని అన్నారు.