Mumbai airport: ముంబై విమానాశ్రయం ప్రపంచ రికార్డు... 24 గంటల్లో 980 విమానాల రాకపోకలు
- గత రికార్డు కనుమరుగు
- అత్యంత రద్దీతో కూడిన ఏకైక రన్ వే విమానశ్రయం ఇదే
- దేశంలో మాత్రం రద్దీ పరంగా రెండో స్థానం
ప్రపంచంలోనే అత్యంత రద్దీతో కూడిన ఏకైక రన్ వే విమానాశ్రయంగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మరోసారి తన రికార్డును తానే తిరగరాసింది. జనవరి 20న 24 గంటల వ్యవధిలో 980 విమానాలు ఇక్కడి రన్ వే పై ల్యాండింగ్, టేకాఫ్ తీసుకున్నాయి.
అంతకుముందు డిసెంబర్ 6న 974 ఫ్లయిట్ల రికార్డు నమోదై ఉంది. రెండో స్థానం బ్రిటన్ లోని గట్విక్ విమానాశ్రయానిదే. వాస్తవానికి గట్విక్ విమానాశ్రయ సామర్థ్యం ఎక్కువే అయినప్పటికీ రోజులో ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకే విమానాల రాకపోకలకు తెరిచి ఉంటుంది. దీంతో ఈ విమానాశ్రయం ఒక్క రోజులో 870 విమానాల రాకపోకలను మాత్రమే నిర్వహించగలదు. మన దేశంలో మొదటి స్థానం ఢిల్లీ అంతర్జాతీయ విమానశ్రయానిదే. గంటలో 82 ఫ్లయిట్ల ట్రాఫిక్ రికార్డు నిర్వహణ ఉంది.